సర్పంచ్ మంజులా రెడ్డి చేసిన ఆరోపణలో నిజం లేదు

  • పార్టీలు చూడకుండానే మునుగోడు అభివృద్ధి కి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషి
  • ఎస్ లింగోటం సర్పంచ్ భీమిడి ప్రదీప్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ, ఏ గ్రామం అని చూడకుండా మౌలిక సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని, ఆయనపై వస్తున్న చౌకబారు ఆరోపణలను నమ్మవద్దని నియోజకవర్గ ముఖ్య నేతలు కోరారు. మునుగోడు ఎమ్మెల్యే నిధుల కేటాయింపుల పక్షపాతం చూపుతున్నారని సర్పంచుల ఫోరం జిల్లా మహిళా అధ్యక్షురాలు, అల్లాపురం గ్రామ సర్పంచ్ టేకుల మంజులా రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామ సర్పంచ్ భీమిడి ప్రదీప్ జి ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు పార్టీలు, జెండాలు ముఖ్యం కాదని.. ప్రజల కష్టాలు మాత్రమే కనిపిస్తాయన్నారు. ఒకవేళ ఆయన పక్షపాతం చూపే వ్యక్తి అయితే ప్రతిపక్ష బిజెపి, బిఆర్ఎస్ నాయకులు తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు. ​కేంద్రం మన రాష్ట్రం నుండి కట్టిన పన్నుల రూపంలో వచ్చే నిధుల్లో సగం ఉంచుకుని, మిగతా సగం మాత్రమే ఇస్తోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాతం వహిస్తూ.. గత మూడేళ్లుగా బడ్జెట్‌లో మొండిచేయ్యే చూపుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలకు స్వస్తి చెప్పి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు.