ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : డా. పి.బి. ఆచార్య
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : రానున్న వారం రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారి డా. పి.బి. ఆచార్య సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఈ సందర్భంగా డా. ఆచార్య మాట్లాడుతూ.. మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండాలని, వీలైనంతవరకు వేకువజామునే పనులు పూర్తి చేసుకుని సాయంత్రం తర్వాత మాత్రమే బయటకు రావడం మంచిదని తెలిపారు.
ఎండల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తరచూ మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు, పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. మసాలా, మాంసాహారాలు, ఆయిల్ ఫుడ్స్ తగ్గించి వేసవికాలానికి అనుకూలమైన సాత్విక ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు.
వడదెబ్బకు గురైనట్లయితే వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశానికి తరలించి, శరీరానికి చల్లగాలి తగిలేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే సమీప వైద్య సిబ్బందికి సమాచారం అందించి తక్షణ చికిత్స చేయించుకోవాలని సూచించారు.
“ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి ఉపయోగించాలి. తరచూ మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకుంటూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి” అని ప్రభుత్వ వైద్యాధికారి డా. పి.బి. ఆచార్య తెలిపారు.
