బాలల భద్రమైన భవితకు ‘కిశోరి వికాసం’

బాలల భద్రమైన భవితకు ‘కిశోరి వికాసం’
ఈ నెల 1 నుంచి జూన్ 11 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
కౌమార బాలబాలికల సాధికారత దిశగా అడుగులు
కెరీర్ గైడెన్స్, నైపుణ్యాభివృద్ధి, సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ: కౌమార దశలోని బాలబాలికల సమగ్ర అభివృద్ధి, భద్రత, ఆత్మవిశ్వాసం, విద్య, ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు “కిశోరి వికాసం” ప్రత్యేక వేసవి శిబిరాలను జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
గురువారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో “కిశోరి వికాసం” కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 1 నుంచి జూన్ 11 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్, నైపుణ్యాభివృద్ధి, యువజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల్లో మంగళ, శుక్రవారాల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
విద్య ప్రాధాన్యం, సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాలపై బాలబాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా సైబర్ భద్రత, జీవనోపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక అక్షరాస్యతపై కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు స్వీయ రక్షణ శిక్షణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, జీవన నైపుణ్యాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ అధికారి సాయిగీత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం. రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
