నగరవ్యాప్తంగా మెరుపు తనిఖీలు..

నగరవ్యాప్తంగా మెరుపు తనిఖీలు..

  • 107 దుకాణాల పరిశీలన
  • 47.5 కిలోల నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం
  • నిబంధనలు ఉల్లంఘించిన 29 మందికి రూ.41,500 జరిమానా..
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దు హెచ్చరిక…

విజయవాడ (కార్పొరేషన్), ఆంధ్రప్రభ ; పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై విజయవాడ నగరపాలక సంస్థ ఉక్కుపాదం మోపింది. వీఎంసీ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు నగరంలోని అన్ని సర్కిళ్లు, డివిజన్లలో బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంది. ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తూ వ్యాపారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. వీఎంసీ విడుదల చేసిన రోజువారీ నివేదిక ప్రకారం నగరంలోని 6 బృందాలు, 3 సర్కిళ్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.

మొత్తం 107 దుకాణాలను పరిశీలించగా, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన 47.5 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించిన 29 మంది వ్యాపారులపై మొత్తం రూ.41,500 జరిమానా విధించారు. అదనంగా చెత్త నిర్వహణ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై రూ.300 లిట్టర్ ఫైన్ విధించారు. సర్కిల్-3 పరిధిలో అత్యధికంగా 30 కిలోల ప్లాస్టిక్ స్వాధీనం కావడం, ఒక్కరోజులోనే రూ.25 వేల జరిమానా వసూలు కావడం అధికారుల్లో ఆందోళన కలిగించింది. నగరంలో ఇంకా నిషేధిత ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతుందనే విషయాన్ని ఈ తనిఖీలు స్పష్టం చేశాయి.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ట్రేడ్ లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్య సిబ్బంది వ్యాపారులు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ 120 మైక్రాన్ల కంటే తక్కువ మందంతో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయని వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవకుండా నేల సారాన్ని దెబ్బతీయడమే కాకుండా, డ్రైనేజీ వ్యవస్థలను మూసివేసి వర్షాకాలంలో నీటి నిల్వలకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తు చేశారు. ప్లాస్టిక్‌కు బదులుగా గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగులు, పేపర్ కవర్లు వినియోగించాలని సూచించారు. పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా విజయవాడలో ఇటువంటి తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగనున్నాయని వీఎంసీ అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply