క్లీన్ విజయవాడ లక్ష్యంగా మరో ముందడుగు

క్లీన్ విజయవాడ లక్ష్యంగా మరో ముందడుగు

విజయవాడ కార్పొరేషన్‌కు 5 నూతన జేసీబీలు

రూ.22 కోట్లతో ఆధునిక వాహనాల ప్రారంభం

అజిత్‌సింగ్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో జేసీబీలను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా

ఆంధ్రప్రభ, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్‌సింగ్‌నగర్ వీఎంసీ డంపింగ్ యార్డ్‌లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.22 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఐదు నూతన జేసీబీ వాహనాలను విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా గురువారం ప్రారంభించారు.

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిరంతర కృషి వల్లే కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా వస్తున్నాయని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. “గ్రేటర్ విజయవాడ” దిశగా అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఐదు జేసీబీలు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

2014కు ముందు ఈ ప్రాంతం తీవ్ర చెత్త సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో బాధపడేదని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో, ఎమ్మెల్యే బొండా ఉమా నాయకత్వంలో చెత్త తొలగింపు, రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర నిధులతో ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు రోడ్డు విస్తరణతో పాటు సింగ్‌నగర్‌లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు.

విజయవాడ నగరంలో కాల్వల సుందరీకరణతో పాటు డ్రైనేజ్ నీరు కాల్వల్లో కలవకుండా మినీ ఎస్‌టీపీల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. దాదాపు 25 మినీ ఎస్‌టీపీల కోసం డీపీఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాల్వలను పార్కులు, ఆకర్షణీయమైన ప్రదేశాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

వరదలు, డ్రైనేజ్ డీ-సిల్టింగ్ పనుల్లో జేసీబీలు కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి సహకరిస్తున్న 15వ ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి ఎస్‌కే గౌసియా, క్లస్టర్ ఇంచార్జ్ కంచి ధనశేఖర్, బేవర సూర్య, కంచేటి నాగరాజు, పిరియ సోమేశ్వరరావు, దాసరి దుర్గారావు, కూర్మపు దుర్గారావు, మల్లంపాటి రవికుమార్, జేసీబీ సంస్థ ప్రతినిధులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.