సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి

సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి

  • బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా
  • బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం శుక్రవారం రాజకీయ నిరసనలతో హోరెత్తింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ధర్నాకు దిగారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

​చట్టం అందరికీ ఒక్కటే కావాలి : కూసుకుంట్ల
​ఈ ధర్నాను ఉద్దేశించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని ఆయన ఆరోపించారు. ​”సామాన్య పౌరుడు తప్పు చేస్తే వెంటనే లాకప్‌లో వేసే పోలీసులు, అధికార పక్షం అండ ఉన్న వారిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ సూత్రం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదు?” అని ఆయన పోలీసు యంత్రాంగాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

​నిష్పక్షపాత విచారణ జరగాలి
బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే, ఈ నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మంత్రి పదవి నుండి తొలగించాలి
కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ ను కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి నుండి తొలగించాలని కూసుకుంట్ల డిమాండ్ చేశారు.

​స్తంభించిన ట్రాఫిక్.. ఉద్రిక్తత
​బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో చౌటుప్పల్ ప్రధాన కూడలిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని పలువురు నాయకులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది. ​ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, ఊడుగు మల్లేష్ గౌడ్, సుర్కంటి రాంరెడ్డి, తాడూరి పరమేష్, బాలరాజు, అత్తార్ పాషా, ఎమ్మెస్ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.