ఓర్వకల్లో అగ్నిమాపక కేంద్రానికి స్థల పరిశీలన.

ఓర్వకల్లో అగ్నిమాపక కేంద్రానికి స్థల పరిశీలన.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ క్షేత్రస్థాయి తనిఖీ.
ఓర్వకల్లు, ఆంధ్రప్రభ : పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్ మండల కేంద్రంలో ప్రతిపాదిత అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అగ్నిమాపక కేంద్ర నిర్మాణం కోసం గుర్తించిన ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ప్రధాన రహదారులతో అనుసంధానం, ప్రభుత్వ భూమి లభ్యత తదితర అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ప్రజలకు అత్యవసర సేవలు మరింత వేగంగా అందించే దిశగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కీలకమని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఓర్వకల్ మండల కేంద్ర పరిధిలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణం కోసం సుమారు 60 సెంట్ల స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేసినట్లు చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా, సాంకేతిక ప్రక్రియలను వేగవంతం చేసి శాఖల మధ్య సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ (ఇంచార్జ్) బాలరాజు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బజారి, ఉప తహశీల్దార్ ఎం.సతీష్, మండల సర్వేయర్ శంకర్ మాణిక్యం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
