బ్యాంకులు, ఏటీఎంల భద్రతపై సమీక్ష

బ్యాంకులు, ఏటీఎంల భద్రతపై సమీక్ష

  • అప్రమత్తంగా ఉండాలని ఎస్డీపీవో సూచన

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు మరియు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని చిత్తూరు ఎస్డీపీవో జె. వెంకటనారాయణ సూచించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు శుక్రవారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో 1 టౌన్, 2 టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు మేనేజర్లతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2 టౌన్ సీఐ డి. నెట్టికంఠయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్డీపీవో మాట్లాడుతూ.. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో ఏటీఎం యంత్రాలను వాహనాల సహాయంతో లాగి తరలించడం, ధ్వంసం చేసి నగదు దోచుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏటీఎం యంత్రాలను బలమైన బోల్టులు, కాంక్రీట్ పునాదులతో నేలకు దృఢంగా అమర్చాలని తెలిపారు.

ప్రతి ఏటీఎం కేంద్రంలో నైట్ విజన్ సదుపాయం కలిగిన నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కనీసం 90 రోజుల వీడియో బ్యాకప్ నిర్వహించాలని సూచించారు. బర్గ్లర్ అలారమ్‌లు, వైబ్రేషన్ సెన్సర్లు, టాంపరింగ్ అలర్ట్ వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేసేలా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఏటీఎం కేంద్రాల లోపల, బయట తగిన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జనసంచారం తక్కువగా ఉండే మరియు భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం కేంద్రాలను ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా బ్యాంకులు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి ఏటీఎం కేంద్రంలో భద్రతా సిబ్బందిని నియమించి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

అలాగే బలమైన షట్టర్లు, ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రతి బ్యాంకు మరియు ఏటీఎం కేంద్రంలో బీట్ పాయింట్ బుక్ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. నగదు నింపే సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ మరియు మెయింటెనెన్స్ సిబ్బంది వివరాలను కాలానుగుణంగా ధృవీకరించాలని తెలిపారు. స్థానిక ఎస్‌హెచ్‌ఓ, ఇన్స్పెక్టర్, డీఎస్పీ, చిత్తూరు కమాండ్ కంట్రోల్ నెంబర్ 9440900005తో పాటు Dial-112 అత్యవసర నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రతి బ్యాంకు, ఏటీఎం కేంద్రంలో ప్రదర్శించాలని సూచించారు.

ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు బంగారు నగల లాకర్లకు పటిష్టమైన భద్రతా గదులు ఏర్పాటు చేసి అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్డీపీవో పేర్కొన్నారు. సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ సమావేశంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ డి. నెట్టికంఠయ్య, తాలూకా ఎస్‌ఐ అశోక్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు.