బైక్ ఇవ్వలేదని వ్యక్తి దారుణ హత్య..
ముగ్గురు నిందితులు అరెస్ట్
బీరు బాటిళ్లతో దాడి..
బండరాయితో మోది హత్య చేసిన నిందితుల అరెస్ట్
తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : ద్విచక్ర వాహనం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తిని బీరు బాటిళ్లతో కొట్టి, అనంతరం బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరచారి, చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. ఆదోని జిల్లా మాదిరి గ్రామానికి చెందిన మాల దాసరి శ్రీనివాసులు (36) ఏడేళ్ల క్రితం ఉపాధి కోసం కుటుంబంతో కలిసి ఓటేరు ప్రాంతానికి వచ్చాడు. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ నెల 9న ఇంట్లో గొడవ జరగడంతో బయటకు వచ్చిన శ్రీనివాసులు ఓ వైన్ షాప్‌కు వెళ్లి మద్యం తీసుకుని ఓటేరు సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కూర్చున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు అతనితో మాట కలిపారు. అనంతరం శ్రీనివాసులను ద్విచక్ర వాహనం అడిగారు.
వాహనం ఇచ్చేందుకు నిరాకరించడంతో నిందితులు అతనితో గొడవకు దిగారు. మొదట బీరు బాటిళ్లతో తలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడి కిందపడిన శ్రీనివాసులను బండరాయితో మోది హత్య చేశారు. అంతేకాకుండా ఈ ఘటనను వీడియో తీసి, అతని ద్విచక్ర వాహనంతో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ మద్దయ్యాచారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు ఆధారాలను సేకరించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో తిరుపతి రూరల్ ఓటేరు గ్రామానికి చెందిన ఉప్పు శెట్టి ఆకాష్ అలియాస్ విక్కీ, శ్రీనివాసపురానికి చెందిన వాసునూరి రాఘవేంద్ర అలియాస్ రాఘవ, తిరుచానూరు యోగ మల్లవరం ప్రాంతానికి చెందిన మరాటి జయవేలురాజాలను రామచంద్రపురం క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి చోరీకి గురైన ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేని అత్యంత పాశవిక హత్య కేసును ఛేదించిన సీఐ మద్దయ్యాచారి, ఎస్సైలు లోకేష్ కుమార్, శ్రీరాములు, జ్యోతి, సిబ్బంది మనోహర్, లక్ష్మీ ప్రసాద్, సూర్య ప్రసాద్, ఆరిఫ్, ప్రశాంత్‌లను ఎస్పీ అభినందించారు.
