ట్రాక్టర్ అజాగ్రత్త .. కూలీ దుర్మరణం
ట్రాక్టర్ అజాగ్రత్త .. కూలీ దుర్మరణం
చిట్యాల, ఆంధ్రప్రభ: వ్యవసాయ పనులకు వెళ్లి ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చెట్టు నీడన కూర్చున్న ఒక కూలీని, అజాగ్రత్తగా వచ్చిన ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్ పేట గ్రామ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
జడల్ పేట గ్రామానికి చెందిన జినుకల శ్రీనివాసరావు (55) రోజువారీ కూలి పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, కాసేపు సేదతీరడం కోసం పొలంలోని ఓ చెట్టు నీడకు వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉన్న భిక్కనూరి మొగిలికి చెందిన వ్యవసాయ భూమిలో పత్తి పోరకలను ఏరువేసేందుకు కొమురె శ్రీనుకు చెందిన ట్రాక్టర్ పనిచేస్తోంది.
ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయి చెట్టు కింద కూర్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన పక్కనే ఉన్న భిక్కనూరి కుమారస్వామి ప్రమాదాన్ని గమనించి పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య ఇంద్ర, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జడల్ పేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను నడిపిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
