లోతుకుంట మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఎంపీడీఓ ఆకస్మిక తనిఖీ
వలిగొండ, ఆంధ్రప్రభ : వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని బాలికల మోడల్ స్కూల్ హాస్టల్‌ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), స్పెషల్ ఆఫీసర్ జి. జలంధర్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా హాస్టల్‌లోని సౌకర్యాలు, స్టోర్‌రూమ్‌లో నిత్యావసర వస్తువుల నిల్వలు, వంటగది, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతను ఎల్లప్పుడూ పాటించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు.
హాస్టల్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, సోక్‌పిట్ పనులను పరిశీలించి, మంజూరైన పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.
విద్యార్థినుల ప్రవేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి, వాటిని ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవసరమైన సమయంలో విద్యార్థినులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని తెలిపారు.
మధ్యాహ్న భోజన సమయంలో ఆహారం, తినుబండారాల నాణ్యతను పరిశీలించి, విద్యార్థినులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భోజనం నాణ్యత పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అనంతరం విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ తనిఖీలో గ్రామపంచాయతీ కార్యదర్శి క్రాంతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రయీసున్నిసా బేగం, హెచ్‌డబ్ల్యూఓ అనిత, తల్లిదండ్రులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
