మోత్కూరులో రోడ్డు ప్రమాదం

మోత్కూరులో రోడ్డు ప్రమాదం
- గోడను బలంగా ఢీకొట్టిన వాహనం
మోత్కూరు, ఆంధ్రప్రభ: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. మున్సిపాలిటీకి చెందిన పల్లపు యాదగిరి (65) తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై భువనగిరి రోడ్డు నుండి అంబేద్కర్ చౌరస్తా వైపు వస్తున్నారు. చౌరస్తా వద్దకు రాగానే ప్రమాదవశాత్తూ వాహనం ఎక్స్‌లేటర్ (Accelerator) ఒక్కసారిగా పెరగడంతో వాహనం అదుపు తప్పింది. దీంతో వేగంగా వెళ్లిన వాహనం అన్నెపు వాడకు వెళ్లే మార్గంలోని ఒక గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే యాదగిరి అపస్మారక స్థితిలోకి వెళ్లి రోడ్డుపై పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
