అప్పులు వాళ్లు చేశారు.. తీర్చే బాధ్యత మాపై పడింది

  • 30 నెల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిల భారాన్ని తాము భరిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత 30 నెలలుగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తమ బిల్లులు చెల్లించాలని రోడ్డెక్కి ఆందోళనలు చేశారని గుర్తు చేశారు.

అప్పులు చేసింది వాళ్లు.. వాటిని తీర్చే బాధ్యత మాత్రం మా మీద పడింది అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి నెలకొందని, విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలు, హాస్టళ్ల మెస్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉందని తెలిపారు. అప్పులతో పాటు పరిపాలనలోనూ తీవ్ర గందరగోళం నెలకొల్పారని ఆరోపించిన సీఎం, రాష్ట్ర ప్రతిష్ఠను కూడా దెబ్బతీశారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లినా గౌరవం లేదు.. పక్క రాష్ట్రాలకు వెళ్లినా ఇబ్బందికర పరిస్థితి ఉండేది అని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తమ ప్రభుత్వం గత 30 నెలలుగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సమాజంలో రాష్ట్ర గౌరవాన్ని పెంచడంతో పాటు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల మధ్యే ఉంటూ పాలన చేస్తున్నాం.. గ‌త పాల‌కుల లాగ‌ ఫామ్‌హౌస్‌లలో ఉండడం లేదు.. ప్రజలకు దూరంగా తిరగడం లేదు అని సీఎం వ్యాఖ్యానించారు.