కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది – హరీష్ రావు
జడ్చర్ల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పేద రైతు సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుబంధు, రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులపై, దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు ఇచ్చారని, అయితే వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తన సొంత గ్రామంలోనే రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే రైతుబంధు, కళ్యాణలక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రైతులు, పేద ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.
రైతులకు బాకీగా ఉన్న రూ.29,300 కోట్ల రైతుబంధు నిధులను ఎప్పుడు చెల్లిస్తారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారానికే పరిమితమై పాలనలో విఫలమవుతున్నారని ఆరోపించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వంటి పథకాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తూ పేద ప్రజలకు అండగా నిలిచిందని తెలిపారు.
పేద ప్రజలకు సహాయం చేసే మనసు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, రైతులను, పేదలను మోసం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. జడ్చర్లలో హరీష్ రావు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డిజిటల్ సభ్యత్వ నమోదు, ‘సర్’ కార్యక్రమాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
