జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు విన్నవించిన నాయకులు, రైతులు

కుంటాల, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు స్థానిక నాయకులు, రైతులు విజ్ఞప్తి చేశారు.

స్థానిక నాయకుడు జీవి రమణారావుతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, కుంటాల మండలంలో అత్యధికంగా జొన్నల పంటలు పండుతున్నాయని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి కుంటాల మండల వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని, రైతుల పక్షాన నిరంతరం అండగా ఉంటానని పేర్కొన్నారు.

ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మార్క్‌ఫెడ్ ఎండీతో కూడా ఈ అంశంపై విన్నవించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిందే దత్తు పటేల్, మేళా సాయిలు, మల్లారెడ్డి, వినోద్, మహేష్ రావుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.