తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌

తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం

ఖమ్మం, ఆంధ్రప్రభ:
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత నందమూరి తారక రామారావు అని, వారు చూపిన సేవా స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఎన్టీఆర్‌ 103వ జయంతి సందర్భంగా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్వర్ణభారతి కమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వారు అమలు చేసిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని, సామాజిక బాధ్యతతో కమ్మ మహాజన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మరింత మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ శిబిరంలో కాన్సర్‌, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, చర్మవ్యాధులు, నేత్ర, స్త్రీ రోగ, శిశు, ఈఎన్‌టీ-, యూరాలజీ, న్యూరో తదితర విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు సేవలు అందించారు. అలాగే రక్తపరీక్షలు, షుగర్‌, బీపీ, ఈసీజీ, ఎక్స్‌రే, మామోగ్రామ్‌ తదితర వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలకు కాన్సర్‌ నిర్ధారణ పరీక్షల కోసం అత్యంత విలువైన వాహనాలను, పరికరాలను సంఘం సభ్యులు బత్తినేని ప్రకాష్‌ సమకూర్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. శిబిరం విజయవంతం కావడంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఖమ్మం శాఖ, కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌, వైద్యులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు అందించిన సహకారం ప్రశంసనీయమని మంత్రి అన్నారు. కార్యక్రమం నిర్వహించిన కమ్మ మహాజన సంఘం ప్రతినిధులను మంత్రి అభినందించగా, శిబిరం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య శిభిరం నిర్వహించటం ఆదర్శనీయం : డాక్టర్‌ తుమ్మల యుగంధర్‌
ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరు భావించాలని ప్రజలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ తుమ్మల యుగంధర్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ఎన్టీఆర్‌ 103వ జయంతి సందర్భంగా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్వర్ణభారతి కమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిభిరానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అందరికీ స్పూర్తిదాయకమన్నారు. తెలుగుజాతి కీర్తి ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు.

అనంతరం డాక్టర్‌ తుమ్మల యుగంధర్‌ రోగులకు స్వయంగా వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మనిషికి విలువ కట్టలేని ఆస్తి ఆరోగ్యమేనని ఆయన సూచనలు చేశారు. ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి వైద్య శిభిరాలు ఇంకా నిర్వహించి ప్రజలకు మేలు చేయాలని వైద్య శిభిరం నిర్వహించిన నిర్వాహకులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్‌ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌, మాజీ మేయర్‌ నీరజ, తుమ్మల యుగంధర్‌, కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు కొల్లు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము, ఉపాధ్యక్షురాలు కర్నాటి రమాదేవి, సహాయ కార్యదర్శి వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మలకుమారి, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, నల్లమల ఆనంద్‌, మేదరమెట్ల స్వరూపరాణి, డాక్టర్‌ పోతినేని భూమేశ్వరరావు, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, కోలేటి నవీన్‌, నంబూరి ప్రసాద్‌, తాళ్లూరి మురళీకృష్ణ, బండి రవికుమార్‌, బతినేని ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.