కేరళ ఓటర్ల పై తెలంగాణ మోడల్ ప్రభావం

కేరళ ఓటర్ల పై తెలంగాణ మోడల్ ప్రభావం

హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాదిలో మరింత బలపడాలని ఆశిస్తున్న కాంగ్రెస్, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పగించిన వ్యూహం ఫలించినట్టుగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కేరళలో యూడీఎఫ్ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

కేరళలో యూడీఎఫ్ తిరిగి పుంజుకుని అధికారం దిశగా దూసుకుపోవడం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార వ్యూహాలు, సరళి బాగా పనిచేసినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేరళలో రేవంత్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా పినరయి విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కేరళ ప్రజలను వంచించిందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో అమలు చేసిన ఆరు గ్యారంటీల తరహాలోనే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని భరోసా ఇచ్చి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారని చెబుతున్నారు. రేవంత్ ప్రకటనలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు వెల్లువెత్తాయి. ఆయన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయక కేరళకు వచ్చి మాటలు చెప్పడమేంటని విమర్శించారు.

ప్రసంగాలు – రాహుల్, సోనియాల నమ్మకాన్ని నిలబెట్టిన రేవంత్
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తన సహజసిద్ధ శైలిలో మళయాళీలను ఆకర్షించారు. ఆయన వివరించిన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు మళయాళీలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేవంత్ రెడ్డి జనాన్ని ఆకర్షించగలిగే నాయకుడు. ఆయన మాటతీరు, ప్రసంగాలు అటు ప్రజల్లోనే కాకుండా కేరళ కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఉత్సాహాన్ని నింపాయి. కేరళలో ఈసారి తమ కూటమి పాగా వేస్తుందని ఆయన ప్రకటించారు.

ఆయన పర్యటన సమయంలోనే యూడీఎఫ్ భారీ ఆధిక్యత సాధిస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి రోడ్ షోలకు కేరళ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాల పట్ల కేరళ ప్రజల్లో ఆకర్షణ పెరిగింది. అలాగే, కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు బీజేపీకి చెందిన ప్రధాని మోదీ ‘గాడ్ ఫాదర్’ అని, కేంద్రంలోని ఎన్డీఏతో కేరళలోని ఎల్డీఎఫ్ పార్టీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయన్న ప్రచారం కూడా ప్రజల్లో నమ్మకం పొందింది.

ప్రజలను ఆకట్టుకోవడంలో రేవంత్ రెడ్డి నైపుణ్యం, విజయన్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన సఫలీకృతుడయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో, తన రెండేళ్ల పాలనను విజయన్ ఐదేళ్ల పాలనతో పోల్చి అంశాల వారీగా వివరించారు. గతంలో కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయవంతం కావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ ఛాందీ కారణమని చెప్పడం ద్వారా అభివృద్ధి వెనుక కాంగ్రెస్ పాత్రను స్పష్టం చేశారు.

మళ్లీ అధికారంలోకి వస్తే ఊమెన్ ఛాందీ తరహా పాలన అందిస్తామని ఆయన ఇచ్చిన హామీ పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల మద్దతును సంపాదించింది. కేరళలో పెరిగిన నిరుద్యోగంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు యువతను ఆకట్టుకున్నాయి. తెలంగాణ మాదిరిగానే అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా యువత ఓట్లను యూడీఎఫ్ వైపు మళ్లించారు.

“తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను వచ్చి చూసి వెళ్లండి” అంటూ బహిరంగ సవాల్ విసరడం ద్వారా కాంగ్రెస్ పాలనపై విశ్వాసాన్ని పెంచగలిగారు. శబరిమల ఆలయంలో బంగారం చోరీ, విజయన్ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు. హిందూ భావోద్వేగాలపై దాడి జరుగుతోందని ఆరోపిస్తూ ఒక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోగలిగారు. ఈ నేపథ్యంలో కేరళలో బీజేపీకి ఉన్న కొంత మద్దతును కూడా యూడీఎఫ్ వైపు తిప్పడంలో రేవంత్ విజయం సాధించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

రేవంత్‌పై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పెట్టుకున్న విశ్వాసం ఫలించినట్టైంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో ఆయనకు మరింత ప్రాధాన్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం పరిమిత రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్, కేరళలో విజయం సాధిస్తే మరొక రాష్ట్రం తమ ఖాతాలో చేరుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.