after9days | అదృశ్యమైన తండ్రి, చివరికి విషాదాంతం

after9days | అదృశ్యమైన తండ్రి, చివరికి విషాదాంతం

after9days | ఇది అదృశ్యమై పోయిన గూడ మల్లేష్ చిన్న కూతురు సుస్మిత ఆవేదన
కళాశాలకు సెలవులు ఇస్తుండడంతో తండ్రి కోసం పడుతున్న పరితపన
దేవుడా.. ఏం చేయాలి..? కూతురికి ఏం చెప్పాలని..?? కన్నతల్లి ఆందోళన
చెబితే నీట్ ప్రవేశ పరీక్ష ఎలా రాస్తుందోనన్న వేదన
దైన్యం నిండిన కుటుంబం.. ఏ దారి, దాపు లేని దయనీయం..
ఇంతకీ మల్లేష్ సజీవమా.. విధి ఆడే వికృత క్రీడలో విగతజీవా..??

after9days | మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఓ వైపు కడుపున పుట్టిన కూతురు కంగారు. కన్నతండ్రి కోసం పడుతున్న ఆరాటం. తండ్రితో మాట్లాడాలని ఉబలాటం. చదువుతున్న కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి రావాలనే పరితపన. మరోవైపేమో ఆరుబయటకని వెళ్లిన ఇంటి పెద్ద అదృశ్యం. అకాలంగా, ఆకస్మికంగా కనిపించకుండా పోయిన వైనం. ఆ ఇంటిని ఆవహించిన దైన్యం. అదృశ్యమై తొమ్మిది రోజులు గడిచినా.. ఇంకా ఎక్కడ దొరకని ఆచూకీ. ఆనవాళ్ళు దొరకని స్థితి. మరో వారం రోజులు గడిస్తే కూతురు రాయబోయే నీట్ ప్రవేశ పరీక్ష. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తండ్రి కనిపించుట లేదని కూతురికి ఎలా చెప్పేది..? ఏమని చెప్పేది..?? కక్కలేక మింగలేక అన్నట్లు ఆ ఇంటి ఇల్లాలు పుట్టెడు దుఃఖాన్ని పుక్కిట పట్టుకుంటోంది. తన్నుకు వచ్చే ఆవేదనను అదిమి పట్టుకుంటోంది.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గూడ మల్లేష్ – సుజాత దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు ఆశా సైనీ బాసరలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు సుస్మిత ములుగు జిల్లా కేంద్రంలోని సీఓఈ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. పెద్ద కూతురు ఆశా సైనీకి తండ్రి కనిపించుట లేదనే విషయం చెప్పినప్పటికీ.. చిన్న కూతురు సుస్మితకు ఈ వార్త తెలియనివ్వలేదు.

ఎందుకంటే మే 3వ తేదీన సుస్మితకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంది. వారిది మధ్య తరగతి కుటుంబమే అయినప్పటికీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు మల్లేష్. ఆటో ద్వారా వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకుంటూ ఇద్దరు కూతుళ్లను లక్షణంగా చదివిస్తున్నాడు. ఇద్దరిని ప్రయోజికులను చేద్దామని తండ్రి మల్లేష్ తలంచిన నేపథ్యంలో ఆయన ఇంట్లో లేడనే విషయం సుస్మిత చెవిన పడనివ్వలేదు.

నాన్నతో మాట్లాడాలి అమ్మా..?

చిన్న కూతురు సుస్మితకు ఇప్పుడు ఒకటే బాధ. నాన్నతో మాట్లాడాలని..! అయితే అది సాధ్యం అయ్యే పనేనా..? ఇంతకాలం కష్టపడి చదివి.. తన జీవిత ఉన్నతికి నీట్ పరీక్ష రూపంలో బాటలు పడుతోంటే.. తండ్రికి ఇలా జరిగిపోయింది, ఇంట్లో నాన్న లేడని చెబితే ఒక్కసారిగా ఆ చిట్టి తల్లి తల్లడిల్లిపోదూ..! ఆమె ఆశయ సౌధాలు కుప్పకూలిపోవూ..! అందుకనే ”నాన్న ఫోన్ పని చేయడం లేదు. సెల్ నీళ్ళలో పడింది. పని మీద బయటకు వెళ్ళాడు” ఆంటూ దాటవేసే నాలుగు మాటలు చెబుతూ నెట్టుకు రావాల్సిన నిస్సహాయ స్థితి నెలకొంది. నిజానికి సుస్మిత చదువుతున్న కళాశాలకు ఈనెల 28వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. ఆరోజు నుండి తమతమ పిల్లలను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మరొక రోజు గడిస్తే ఆమెను ఇంటికి తీసుకు రావాలి. ఎందుకంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే సుస్మితకు నీట్ పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇంటికి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యి ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలని ఆ చిన్నారి తల్లడిల్లిపోతోంటే.. విధి చేసిన వింత ఘటన ఆందోళనకర స్థితిని తెచ్చి పెట్టింది.

ఏకైక దిక్కు, భరోసా పోలీసుల విచారణే..!

తొమ్మిది రోజులుగా అనేక అనుమానాలు, సందేహాలు ఆ కుటుంబ సభ్యులను తొలుస్తోంటే.. ఆలోచనల ముసుర్లను కుదేలు చేస్తోంటే ఇక పోలీసుల ఇన్వెస్టిగేషనే ఏకైక దిక్కు అని అనిపిస్తోంది. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ తో గోదావరి నది తీరాన్ని జల్లెడ పడుతున్న నేటికీ ఆచూకీ లభించక పోవడంతో ఇంకేం చేయాలి..? అనే దిశగా పోలీసులు దర్యాప్తు పై దృష్టి సారించారు. సాధ్యమైనంత వరకు అదృశ్యం కేసు చేధించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న పోలీసులు దర్యాప్తు అయితే ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. కేవలం పేకాట ఆడేందుకని వెళ్లి అనుకోని ఘటనతో అదృశ్యమై పోయిన మల్లేష్ ఎక్కడ ఉన్నాడు..? అతని సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఎందుకైంది..? అసలేం జరిగింది..? అన్నది కలిచి వేస్తోంది. ఆ కుటుంబాన్ని కదిలించి వేస్తోంది. ఇంతకీ ఈ మిస్టరీ ఘటన చిక్కుముడి ఎప్పుడు వీడుతుందో..? ఇన్ని రోజులుగా నిరీక్షిస్తున్న మల్లేష్ సొంతింటికి నిక్షేపంగా ఎప్పుడు వస్తాడో..??!

దొరికిన మృతదేహం…

after9days
after9days

తొమ్మిది రోజులుగా కనిపించకుండా పోయిన గూడ మల్లేష్ మృతదేహం శనివారం ఉదయం 11:30 గంటలకు గోదావరి నదిలో లభ్యం కావడం విషాదకరం. గోదావరి నది సమీపంలోని గుడిరేవు వద్ద మృతదేహం దొరకడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృశ్యమై పోయిన మల్లేష్ కు ఏమైంది..? ఆత్మహత్య చేసుకున్నాడా..? ఎవరైనా కొట్టి చంపి గోదావరి నదిలో పడేశారా..? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click here to read more

click here to read ఒక బాధితురాలి గుండెకోత

Leave a Reply