జిల్లాలో ఎరువులకు కొరత లేదు: కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
- రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- నందిగామలో ఎరువుల దుకాణంపై ఆకస్మిక తనిఖీ
- పంపిణీ విధానంపై పరిశీలన
- ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతుల అర్హత, ఎరువుల కేటాయింపుల పరిశీలన
- అవసరానికి మించి రసాయన ఎరువులు వాడొద్దు
- శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి
- రాఘవాపురంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల పరిశీలన
- ప్రకృతి వ్యవసాయానికి కలెక్టర్ ప్రోత్సాహం
నందిగామ, ఆంధ్రప్రభ: జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్యూ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన ఏపీఏఐఎంఎస్ విధానం ద్వారా ప్రతి రైతుకు అర్హత మేరకు ఎరువులు కేటాయిస్తున్నామని, అవసరమైన సమయంలో వాటిని పొందవచ్చని తెలిపారు.
గురువారం నందిగామ పట్టణంలోని శ్రీ మణికంఠ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువుల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందుతున్నాయా, ప్రభుత్వ మార్గదర్శకాలు అమలవుతున్నాయా అనే అంశాలను స్వయంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఎరువుల ధరల పట్టికలు, హెల్ప్‌లైన్ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించడంపై దృష్టి సారించారు. రైతులు పంట నమోదు పూర్తి చేసుకున్నారా, వారికి కేటాయించిన ఎరువులు సరైన విధంగా పంపిణీ అవుతున్నాయా అనే వివరాలను పరిశీలించారు.
ఏపీఏఐఎంఎస్ యాప్‌లో రైతుల భూవిస్తీర్ణం, పంట నమోదు, ఎరువుల అర్హత, ఇప్పటికే పొందిన పరిమాణం, ఇంకా అందాల్సిన కోటా వంటి వివరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ప్రతి రైతుకు ప్రభుత్వం కేటాయించిన కోటా ఆయా రైతులకే కేటాయింపుగా ఉంటుందని, ఒకేసారి మొత్తం ఎరువులు తీసుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైనప్పుడు తమ కోటా మేరకు పొందవచ్చని వివరించారు. రైతులు అవసరానికి మించి రసాయన ఎరువులు వినియోగించవద్దని కలెక్టర్ సూచించారు.
అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యత, పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం అవసరమైన మోతాదులోనే ఎరువులు వినియోగించాలని సూచించారు.
పచ్చిరొట్ట పంటల సాగు, పంట మార్పిడి విధానాలను రైతులు విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్ కోరారు. దీంతో భూసారం పెరగడమే కాకుండా రసాయన ఎరువుల వినియోగం తగ్గి, వ్యవసాయ వ్యయం కూడా తగ్గుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏలినినో ప్రభావం ఉన్న నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకుని లాభదాయకమైన సాగు సాధ్యమవుతుందని వివరించారు.
అనంతరం రాఘవాపురం గ్రామంలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను కలెక్టర్ సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు. పంటల దిగుబడి, సాగు విధానాలు, మార్కెట్ అవకాశాలు, పంట రుణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా పండించిన సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు రైతులు ముందుకు రావాలని, ప్రజలు కూడా సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో నందిగామ ఆర్డీవో ఎ. అనిల్ కుమార్, తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఎంపీడీవో వరప్రసాద్, ఏపీవో శరత్ బాబు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
