24aprilcrimealert | ఒక బాధితురాలి గుండెకోత

24aprilcrimealert | ఒక బాధితురాలి గుండెకోత
24aprilcrimealert | హోటల్ గదిలో ‘అదృశ్య కన్ను’ – బాధితురాలి వేదన
పోలీసుల దర్యాప్తులో బయటపడిన షాకింగ్ నిజాలు
డీప్‌ఫేక్, పిన్‌హోల్ కెమెరాల ప్రమాదం
టెక్ నిపుణులు సూచించిన రక్షణ చిట్కాలు
అప్రమత్తతే అసలు భద్రత
24aprilcrimealert | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : “నా పేరు సౌమ్య(పేరు మార్చబడింది) నాకు తెలిసిన ప్రపంచం వేరు.. నేను బతుకుతున్న ఈ డిజిటల్ మాయాజాలం వేరు అని ఆ రోజు తెలిసింది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నా కాళ్ళ మీద నేను నిలబడటం మా అమ్మానాన్నలకు గర్వకారణం. ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఒక పేరున్న హోటల్‌లో గది ఇస్తే.. అది నా ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఊహించలేదు. గదిలో నేనొక్కదాన్నే ఉన్నానన్న ధరోసాతో, స్వేచ్ఛగా బట్టలు మార్చుకుంటున్న నా అత్యంత వ్యక్తిగత క్షణాలను ఎవరో దొంగచాటుగా బంధించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూసినప్పుడు నా భూమి బద్దలైనంత పనైంది. ఎవరికీ మొహం చూపించలేక, అవమానంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు నన్ను కాపాడి, ధైర్యం చెప్పి పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారు.”

24aprilcrimealert | పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
ఈ కేసును విచారించిన పోలీసులకు భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేను బస చేసిన హోటల్ గదిలో, కంటికి కనిపించని రీతిలో స్మోక్ డిటెక్టర్ లోపల అమర్చిన ‘పిన్ హోల్’ కెమెరాలు ఆచ్చాదన లేని నా అందాలను బంధించాయి. అంతటితో ఆగకుండా, ఆ వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్‌ఫేక్ టెక్నాలజీ సహాయంతో అపరిచితులు మరింత క్లియర్‌గా మార్చారు. నిందితులు కేవలం వీడియోలు తీయడమే కాకుండా, వాటిని మార్కెట్ చేసుకుంటున్నారని విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక సైబర్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఇలాంటి బాధితులు ఎందరో..
ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కథ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అపరిచిత ప్రాంతాల్లో, హోటళ్లలో, ట్రయల్ రూమ్స్‌లో ఇలాంటి ‘అదృశ్య’ కెమెరాల బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్న, మానసిక వేదన అనుభవిస్తున్న బాధితులు ఎందరో ఉన్నారు. మన ఏకాంతాన్ని మనం అనుభవిస్తున్నామనుకుంటున్న తరుణంలో, ఎక్కడో ఒక మూల ఒక కుటిల కన్ను మనల్ని గమనిస్తూనే ఉంటోంది. టెక్నాలజీ మనిషికి అవకాశాలను ఇవ్వాలి, సమస్యలను పరిష్కరించాలి. కానీ నేడు అది కొందరు వికృత బుద్ధి గల వారికి ఆయుధంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కేవలం చట్టాలే కాదు.. ప్రతి ఒక్కరిలో అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టెక్ నిపుణులేమంటున్నారంటే..
అపరిచిత ప్రదేశాల్లో గదిలోకి వెళ్ళగానే ఈ చిన్నపాటి తనిఖీలు చేయడం వల్ల ఇలాంటి వికృత కళ్ళ నుండి తప్పించుకోవచ్చు:
ఫోన్ టార్చ్ లైట్ టెస్ట్: గదిలోని లైట్లు ఆపివేసి, మీ ఫోన్ టార్చ్‌లైట్‌తో గదిలోని స్మోక్ డిటెక్టర్లు, ఏసీ వెంట్స్, గోడ గడియారాలను స్కాన్ చేయాలి. లెన్స్ ఉంటే కాంతి పరావర్తనం చెంది చిన్న మెరుపు కనిపిస్తుంది.
టూ-వే మిర్రర్ చెక్: అద్దంపై మీ వేలిని ఉంచినప్పుడు, వేలికి.. దాని ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అది ‘టూ-వే మిర్రర్’ అయ్యే అవకాశం ఉంది. అంటే అద్దం అవతలి వైపు నుండి ఎవరో చూస్తున్నారని అర్థం.
నైట్ విజన్ కెమెరాలు: ఫోన్ కెమెరా ఆన్ చేసి చీకటి గదిలో స్కాన్ చేస్తే, కంటికి కనిపించని ఇన్‌ఫ్రారెడ్ లైట్లు కెమెరా స్క్రీన్‌పై ఊదా రంగులో మెరుస్తూ కనిపిస్తాయి.
మన అప్రమత్తతే మనకు రక్ష. హోటల్ గది అయినా, షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్ అయినా.. భరోసా కంటే మన సొంత తనిఖీ ముఖ్యం. సాంకేతికత ఎంత ఎదిగినా మన రక్షణ మన చేతుల్లోనే ఉందనేది మరువకూడదు.
