రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం

రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

జలుమూరు(నరసన్నపేట), ఆంధ్రప్రభ : రీ-సర్వే అనంతరం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి, రైతులకు తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రీ-సర్వే పురోగతి, రికార్డుల నమోదుపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అక్కురాడ పంచాయతీ పరిధిలోని ఐదు రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 924 ఖాతాలు ఉండగా, ఇప్పటివరకు 45 ఖాతాలను మాత్రమే సరిచేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది.

మిగిలిన ఖాతాల్లో దొర్లిన పొరపాట్లను సరిదిద్దడంలో జాప్యంపై రైతులు తమ విన్నపాలను కలెక్టర్ ముందు ఉంచారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సర్వే లోపాలను సవరించేందుకు మండల స్థాయి అధికారులు, సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి రైతుకూ పారదర్శకంగా, ఎటువంటి అక్షర దోషాలు లేని పాసు పుస్తకాలు అందించే బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఖాతాల్లో మార్పులు అవసరమయ్యాయి.

వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు, ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారందరికీ సత్వరమే పాసు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పర్యటనలో ఆయన వెంట తహసిల్దార్ జెన్ని రామారావు తదితరులు ఉన్నారు.

Leave a Reply