ఆన్‌లైన్ స్నేహం…

ఆన్‌లైన్ స్నేహం…

ప్రమాదపు అంచుల దాకా పయనం
48 గంటల్లో ఇద్దరు బాలికలను కాపాడిన చిత్తూరు పోలీసులు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు నగరంలో జరిగిన ఒక ఘటన, నేటి తల్లిదండ్రులకు గట్టిగా హెచ్చరిక మోగిస్తోంది. మొబైల్ ఫోన్‌లో మొదలైన ఒక “స్నేహం”, రెండు కుటుంబాలను ఆందోళనలో ముంచేసింది. అయితే, పోలీసులు చురుకైన చర్యలతో ఆ కథ సుఖాంతమైంది. కొంగారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో, వారి తల్లులు ఆందోళనతో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.

“ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు” అనే ఒక్క మాటే కుటుంబాల గుండెల్లో కలకలం రేపింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి నిమిషం విలువైనదిగా భావిస్తూ పోలీసులు వేగంగా పనిచేశారు. సాంకేతిక ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల విశ్లేషణ, సీసీ కెమెరాల పరిశీలన—ఇలా అన్ని మార్గాల్లో పోలీసులు ప్రయత్నాలు కొనసాగించారు.

చివరకు బాలికల జాడ గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుని, 48 గంటల్లోనే బాలికలను సురక్షితంగా గుర్తించి చిత్తూరుకు తీసుకువచ్చారు. కానీ ఈ కథలో అసలు మలుపు, బాలికలు చెప్పిన విషయమే. వారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తులతో “టూర్‌కు వెళ్లాలని” నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్పితే అనుమతి ఇవ్వకపోవచ్చని భావించి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయారు. ఒక చిన్న నిర్ణయం, ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఇది స్పష్టంగా చూపించింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి అనర్థం జరగకముందే పోలీసులు జోక్యం చేసుకున్నారు.

కానీ ప్రతి ఘటన ఇలా సుఖాంతం అవుతుందని చెప్పలేం..పోలీసులు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఒక సూటి సందేశం ఇచ్చారు. పిల్లలతో స్నేహంగా ఉండండి. వారిని కట్టడి చేయడం కంటే, అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇప్పటి పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లలో గడుపుతున్నారు. ఎవరి తో మాట్లాడుతున్నారు, ఏ యాప్‌లు వాడుతున్నారు—ఇవి తెలుసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా 14 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా పరిచయాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం—పిల్లలు ఒంటరిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తే, వెంటనే వారితో మాట్లాడాలి. వారి ఆలోచనలు, స్నేహాలు, భావాలు తెలుసుకోవాలి.

లేకపోతే, వారు బయట అపరిచితుల్లో ఆప్యాయత వెతుక్కోవచ్చు. పోలీసులు హెచ్చరిస్తున్న మరో అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా ముఠాలు లేదా ఇతర నేరగాళ్లు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఘటన ఒక కుటుంబానికి కాదు… సమాజానికే పాఠం. చిత్తూరు పోలీసులు సమయస్ఫూర్తితో పనిచేసి ఇద్దరు బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Leave a Reply