దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి

దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి
- అడ్లూరి లక్ష్మణ్ కుమార్
షాద్ నగర్, ఆంధ్రప్రభ : నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో దళిత శోభమ్మ పై హత్యా ప్రయత్నం చేసి విచక్షణ రహితంగా దాడి చేసిన దోషులను ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. మొన్న రాత్రి ఎధిర గ్రామంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షురాలు, దళిత శోభమ్మపై అదే గ్రామానికి చెందిన మైలారం అంజయ్య, మైలారం బందయ్య, వడ్డే అశోక్, గుడుగోని పల్లి మొగులయ్యలు పథకం ప్రకారం వ్యవసాయ పురం వద్దకు పిలిచి అర్ధరాత్రి మహిళపై విచక్షణారహితంగా కాలు చేతులు కట్టి చంపేందుకు దాడిచేసిన ఘటన సంచలనం రేకెత్తించడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ఈ సందర్భంగా షాద్ నగర్ రూరల్ సిఐ శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన విషయాలను ఆరా తీశారు. దోషులు ఎవరైనా సరే ఫిర్యాదు ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఉపేక్షించవలసిన అవసరం లేదని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా జిల్లేడు చౌదరి గూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజుతో కూడా మంత్రి లక్ష్మణ్ మాట్లాడారు. సంఘటనపై వాస్తవాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల పక్షాన అండగా నిలబడాలని, న్యాయం జరిగేంత వరకు వారికి సహకరించాలని మంత్రి లక్ష్మణ్ రాజుకు తెలియజేశారు. సంఘటనపై స్పందించిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కు మండల పార్టీ అధ్యక్షుడు రాజు కృతజ్ఞతలు తెలిపారు.
