చిలకలూరిపేటలో కారు బీభత్సం

చిలకలూరిపేటలో కారు బీభత్సం
- హోటల్లోకి దూసుకెళ్లిన వాహనం
- ఐదుగురు అదుపులో
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తృటిలో ఓ పెను ప్రమాదం తప్పింది. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో గంజాయి మత్తులో కొందరు యువతీయువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి నేరుగా హోటల్లోకి దూసుకెళ్లడంతో పెను కలకలం రేగింది.
ఘటన వివరాల్లోకి వెళితే…

స్థానిక విజయ బ్యాంకు సెంటర్ సమీపంలో ఉన్న ఒక టిఫిన్ హోటల్లోకి బెలెనో (బ్యాలెనో) కారు అదుపుతప్పి అత్యంత వేగంగా దూసుకొచ్చింది.కారు వేగానికి హోటల్లోని కుర్చీలు,బల్లలు, ఇతర వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పిందని, అదే ఉదయం రద్దీ సమయంలో జరిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.
కారులో ఐదుగురు… మత్తులో యువత!

ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు యువకులు కాగా,ముగ్గురు యువతులు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.వీరంతా గంజాయి మత్తులో ఉన్నారని,ఆ మత్తులోనే కారును విపరీతమైన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. యువత ఇలా మత్తు పదార్థాలకు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై స్థానికులు మండిపడుతున్నారు.
బెంబేలెత్తిన విద్యార్థులు,తల్లిదండ్రులు:

ప్రమాదం జరిగిన విజయ బ్యాంకు సెంటర్ పరిసర ప్రాంతాల్లో పలు స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి.నిత్యం వందలాది మంది విద్యార్థులు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. కారు బీభత్సం సృష్టించిన తీరు చూసి అటుగా వెళ్తున్న విద్యార్థులు, వారిని బడిలో దింపేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవేళ ఆ కారు రోడ్డుపై వెళ్లే విద్యార్థులను ఢీకొట్టి ఉంటే పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు:

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరిపేట అర్బన్ ఎస్సై పి.హజ్రాతయ్య సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.పరిస్థితిని సమీక్షించి,ధ్వంసమైన హోటల్‌ను పరిశీలించారు.అనంతరం కారులో ఉన్న యువతీ,యువకులను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
