రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు

రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు
- మూడు విభాగాల్లో అవార్డులకు ఎంపిక
- మంత్రి చేతుల మీదుగా స్వీకరించిన సూపరింటెండెంట్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : వైద్య సేవలు అందించడంలో కార్పోరేట్ ఆసుపత్రికి ధీటుగా పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిలిచింది. అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను 3 విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో అవార్డులకు జిల్లా ఆసుపత్రిని ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక అవార్డులు పొందిన ఘనత పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి దక్కింది. జిల్లా ఆసుపత్రి 3 విభాగాల్లో అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ సూపరిండెంటంట్ కేటగిరిలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, అనస్థీషియా సివిల్ సర్జన్ గా డాక్టర్ కొండా శ్రీధర్, ఆరోగ్యశ్రీ కేసులలో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచినందుకు మరో అవార్డు, టీ హబ్ ద్వారా అత్యధిక రక్త పరీక్షలు చేసినందుకుగాను మరో అవార్డు సొంతం చేసుకున్నారు.

ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదారాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అవార్డులను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కొండా శ్రీధర్ మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా అందుకున్నారు. రేడియాలజీ డిపార్ట్మెంట్ తరపున ఎక్కువ స్కానింగ్స్ చేసినందుకు డా. సంధ్యారాణి అవార్డు అందుకున్నారు. జిల్లా ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కడం పట్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ కు పలువులు అభినందనలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రత్యేక చొరవ వైద్యులు, సిబ్బంది కృషి ఫలితంగా ఈ అవార్డులు దక్కాయని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణలో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని ఇలానే నెంబర్ వన్ గా నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని, ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి వైధ్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
