రెండో రోజు ప్రేక్షకులను అలరించిన నాటికలు..

రెండో రోజు ప్రేక్షకులను అలరించిన నాటికలు..

యడ్లపాడు, ఆంధ్రప్రభ : పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కళా రూపాల ద్వారా సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కళానిలయం స్థాపించామని తెలుగు నాటక కళాపరిషత్ సమ్మేళన సంఘం వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్‌బాబు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే భావజాలాన్ని నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ప్రజలకు చేరవేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కళల ద్వారా చైతన్యం కలిగించి, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడమే తమ కర్తవ్యమని ఆయన అన్నారు. 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల రెండోవ రోజు పోటీలను ఆయన ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉత్తమోత్తమ ప్రదర్శలను ఎంపిక చేసి ఇక్కడకు తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామస్తులే.. కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కళాభిమానులు, నాటక పరిషత్తుల నిర్వాహకులు రోజుకు 2500 మంది రావడం సంతోషదాయకమ న్నారు. ముందుగా పరిషత్ నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు, దాతలు సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించగా, అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు తమ అభ్యుదయ గీతాలతో సుందరయ్యకు కళాంజలి సమర్పించారు.

పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అతిథులు..
గౌరవ సలహాదారులు జరుగుల రామారావు, ఆలోకం పెద్దబ్బయ్య, ఉపాధ్యక్షులు జరుగుల శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ముత్తవరపు రామారావు, కార్యదర్శి నూత లపాటి మాధవరావు, సహాయ కార్యదర్శి చెరుకూరి సృజన, కోశాధికారి షేక్ బాజి, సభ్యులు నంబూరి శ్రీనివాసరావు, ముత్తవరపు పద్మారావు, నూతలపాటి కాళిదాసు, పోపూరి అనంతలక్ష్మి, చెన్నుపాటి హనుమంతరావు, కల్లూరి సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు, సామినేని ఫణికుమార్, నాగండ్ల రాంబాబు ఉన్నారు.

శనివారం రాత్రి ప్రదర్శించిన నాలుగు నాటికల కథా సంగ్రాహాలు…

అమ్మ చెక్కిన బొమ్మ నాటిక
విభిన్న శరీరతత్వాలు ఉన్నవారు కూడా మనసున్న మనుషులేనన్న సత్యాన్ని చాటిచెప్పే అద్భుత దృశ్యకావ్యం అమ్మ చెక్కిన బొమ్మ నాటిక. సృష్టిలో మానవ జన్మ అత్యుత్తమం, కానీ మన నాగరికత కేవలం స్త్రీ పురుషులకే పరిమితమైందా? పురాణాల నుండి నేటి వరకు 20 రకాల శరీర తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారన్నది పచ్చి నిజం. టెక్నాలజీతో చందమామపై ఇళ్లు కడుతున్నా, విభిన్న శరీరతత్వాలు ఉన్నవారిని సమాజం ఇంకా వెలివేస్తూనే ఉంది. లింగ వివక్షతో వారిని అసహ్యించుకోవడం మన ఆధునిక సమాజపు దిగజారుడుతనానికి నిలువుటద్దం. ప్రకృతి సిద్ధమైన వారి ఉనికిని గుర్తించకపోవడం మన సంకుచిత ఆలోచనా ధోరణికి పరాకాష్ట. అవమానాలను భరిస్తూ బతుకుతున్న ఆ మనుషుల ఆవేదనను తరిచి చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చాటి చెప్పే ఈ నాటికను గోవాడ క్రియేషన్స్‌(హైదరాబాద్‌) వారు సమర్పించారు. జ్యతిరాజ్‌ భీశెట్టి రచనకు డాక్టర్‌ వెంకట్‌ గోవాడ దర్శకత్వం వహించారు.

స్రీ మాత్రే నమః నాటిక
అందమైన కలల లోకంలో విహరిస్తున్న ఒక సామాన్య యువతి జీవితంలో జరిగిన ఓ అనూహ్య ప్రమాదంతో ఊహించని మలుపే స్త్రీ మాత్రే నమః నాటిక ఇతివృత్తం. ప్రేమించిన వాడితో పెళ్ళి, అమెరికాలో స్థిరపడాలనే ఓ యువతి కథ ఇది. కానీ ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని అంతా తలకిందులు చేసి, ఊహించని భారమైన బాధ్యతను ఆమె భుజాల పై ఉంచుతుంది. ఒక వైపు కెరీర్, మరో వైపు మోయలేని బాధ్యత.. రెండింటి మధ్య నలిగిపోతున్న ఆమెకు దిక్కుతోచని స్థితి ఎదురవుతుంది. సరిగ్గా అప్పుడే ఆమె జీవితంలోకి ఒక పెద్దాయన ప్రవేశించి, కష్టాల్లో ఉన్న ఆమెకు ఆమె ఆలోచనలను ధైర్యాన్ని ఇచ్చి, తిరిగి ఆమె జీవితాన్నే ఒక పెద్ద మలుపు తిప్పుతాడు. కన్నతల్లి కాకపోయినా, తల్లి స్థానంలో ఉన్న స్త్రీ ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రేమ కంటే బాధ్యతకే అగ్రతాంబూలం ఇస్తుందని, సొంత సుఖాలను త్యాగం చేసి బాధ్యతను నెత్తిన పెట్టుకునే ప్రతి స్త్రీ మూర్తి వెనుక ఇలాంటి గొప్ప త్యాగం దాగి ఉంటుందని తెలియజేసింది ఈ నాటిక. స్వర్ణసూర్య డ్రామ రివర్స్‌(హైదరాబాద్‌) వారు సమర్పించిన నాటిక పూర్ణిమా పెమ్మరాజు మూలకథకు రూపం. ఉదయ భాగవతుల నాటకీకరణ చేసి, దర్శకత్వం వహించారు.

మాతృత్వం.. నాటిక
వ్యక్తిత్వం కంటే తన అందానికే ప్రాధాన్యత ఇచ్చే ఓ యువతి కథనమే మాతృత్వం నాటిక ఇతివృత్తం. డాక్టర్‌ సంతోష్, లావణ్యల పదేళ్ల దాంపత్యం పిల్లలు లేకపోయినా సాఫీగానే సాగుతుంటుంది. అయితే దీనికి కారణం లావణ్య తన శారీరక సౌందర్యం ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో సంతానం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే. ఏరోబిక్‌ కోచ్‌గా తన వృత్తిని, అందాన్ని ప్రేమించే లావణ్యకు.. మనవడు కావాలని కోరుకునే అత్తగారు ప్రమీలకు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుంటుంది. భార్య పంతానికి, తల్లి కోరికకు మధ్య సంతోష్‌ నలిగిపోతుంటాడు. అనుకోకుండా లావణ్య గర్భవతి కావడంతో కథ మలుపు తిరుగుతుంది. తాను నమ్ముకున్న జాగ్రత్తలు విఫలం కావడానికి భర్త, అత్తగారే కారణమని, వారు తనను మోసం చేశారని లావణ్య భావిస్తుంది. ఆ కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఈ వియోగం భరించలేక అత్తగారు ప్రమీల పక్షవాతానికి గురవుతుంది. తన పుట్టినరోజున భర్త బ్రతిమాలినా, అత్తగారిని వదిలేస్తేనే కాపురానికి వస్తాననే కఠినమైన షరతు పెడుతుంది లావణ్య. చివరకు గర్భవిచ్ఛిత్తికి కూడా సిద్ధపడిన ఆమె మొండితనం సంతోష్‌ను వేదనకు గురిచేస్తుంది.

కాలక్రమంలో లావణ్య బిడ్డను ప్రసవిస్తుంది. బిడ్డ తనకే కావాలని, తండ్రికి కూడా హక్కు లేదని ఆమె వాదిస్తుంది. ఈ క్రమంలో బిడ్డ కోసం దంపతుల మధ్య జరిగే పెనుగులాట పక్షవాతంతో ఉన్న ప్రమీలను కదిలిస్తుంది. బిడ్డను లాక్కున్న కొడుకుని మందలించి, బిడ్డను తల్లి ఒడికే చేరుస్తుంది ప్రమీల. తల్లీబిడ్డలను వేరు చేయాలని చూస్తే వాడు కన్నకొడుకైనా, కట్టుకున్న మొగుడైనా క్షమించేది లేదంటూ స్త్రీ జాతి ఐక్యతను, మాతృత్వపు విశిష్టతను ఆమె చాటిచెబుతుంది. అత్తలోని ఆ మహోన్నత మాతృమూర్తిని చూసి లావణ్య పశ్చాత్తాపంతో ఆమె పాదాలకు ప్రణమిల్లడంతో కథ సుఖాంతమవుతుంది. శ్రీరమణా కళానిలయం (గుంటూరు) వారు సమర్పించిన ఈ నాటిక మూలకథ, నాటకీకరణ సుఖమంచి కోటేశ్వరరావు చేయగా పొగర్తి నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు.

అందరూ మంచివారే కానీ.. నాటిక
ఒక సామాన్య రైతు కుటుంబం, ఆ ఇంట్లోని ప్రేమానురాగాలు.. ఇదే అందరూ మంచివారే కానీ.. నాటికలోని మధురమైన ప్రారంభం. పేదింటి కోడలైనా సుమిత్రకు తన మామయ్య కష్ణమూర్తి అంటే అపారమైన గౌరవం, భర్త వర్థన్‌తో అన్యోన్యత, అన్నిటికీ మించి ప్రాణ సమానమైన మరదలు సౌజన్య అంటే ఎంతో అభిమానం. రక్షాబంధనం వేళ అన్న ఇచ్చే వెయ్యి రూపాయల కంటే, తన ప్రేమే ఎక్కువని భావించే సౌజన్య.. మామయ్య స్నేహితుడి కంటి ఆపరేషన్‌ కోసం డబ్బు ఖర్చు చేసేంత ఉదార స్వభావురాలు. తన పెళ్లి కోసం కొన్న బంగారు గొలుసును కూడా పక్కన పెట్టి ఎదుటివారి ఆకలి తీర్చే గుణం ఆమెది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో, విధి ఆ కుటుంబంపై పగబట్టింది. ప్రేమమూర్తి అయిన సౌజన్యకు ప్రాణాంతకమైన జబ్బు చేసిందని తెలియడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. రక్తం మారిస్తేనే కొంతకాలం బతుకుతుందని వైద్యులు చెప్పిన వేళ, అందరూ ఊహించని మలుపు సుమిత్ర రూపంలో ఎదురవుతుంది. అంతవరకు ప్రాణంగా చూసుకున్న మరదలు ప్రాణాల కోసం రూపాయి ఖర్చు పెట్టినా సరే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని భర్తను బెదిరిస్తుంది సుమిత్ర.

ఒకవైపు ప్రాణాపాయంలో ఉన్న మరదలు, మరోవైపు భార్య హెచ్చరిక.. వర్థన్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. సౌజన్య మరణం తర్వాత ఆ కుటుంబంలో జరిగిన పరిణామాలు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తాయి.ఆ ఇంట్లోని అందరూ మంచివారే, అందరిదీ గొప్ప మనసే.. మరి ఎందుకు ఆ కుటుంబం ఇంతటి వేదనను అనుభవించాల్సి వచ్చింది? మనిషి మంచితనానికి, పరిస్థితుల ప్రాబల్యానికి మధ్య జరిగిన ఈ పోరాటమే అందరూ మంచివారే కానీ.. నాటిక.జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత (యడ్లపాడు) బృందం ప్రదర్శించిన ఈ నాటిక సమాజంలో మనుషుల ప్రవర్తనను,మమకారం లోని మరో కోణాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది. ఆహ్వాన నాటికల పోటీలలో శనివారం రెండవ రోజు కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించారు.సామాజిక,భావోద్వేగ, వినోదాత్మక అంశాలతో కూడిన నాటికలు ప్రదర్శించబడగా,ప్రతి నాటికకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కళాకారుల నటన,వేదిక అలంకరణ,కథా ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నాటికల పోటీలు యడ్లపాడు ప్రాంతంలో కళాస్ఫూర్తిని పెంపొందిస్తూ, యువతలో సృజనాత్మకతను వెలికి తీస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలు మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.