గృహ ప్రవేశం చేయించిన కలెక్టర్, ఎమ్మెల్యే..

గృహ ప్రవేశం చేయించిన కలెక్టర్, ఎమ్మెల్యే..
జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరు
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని 44వ వార్డులో ప్రధాన మంత్రి ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహాన్ని సోమవారం స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ తో కలసి కలెక్టర్ లబ్ధిదారుని చేత గృహ ప్రవేశం చేయించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఈ ఇల్లు మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా, మీ కుటుంబానికి భద్రతగా ఉండాలని, మీ జీవితాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు లబ్ధిదారునికి చెప్పారు. పిఎంఎవై గ్రామీణ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఏప్రిల్ నెలలో నిధులు వస్తాయని, లబ్దిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
జిల్లాలో 1112 గృహాలకు 13. 22 కోట్లు ఖర్చు అయ్యిందన్నారు. పూర్తి అయిన గృహాలు నియోజక వర్గాల వారీగా చూస్తే ఆమదాలవలస నియోజకవర్గంలో 106, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 112, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 151, నరసన్నపేట నరసన్నపేట నియోజకవర్గంలో 55, పలాస నియోజకవర్గంలో 163, పాతపట్నం నియోజకవర్గంలో 201, శ్రీకాకుళం నియోజకవర్గంలో 324 గృహాలు పూర్తి చేసినట్లు చెప్పారు. లబ్దిదారులకు పెండింగులో ఉన్న బిల్లులు సత్వరమే విడుదల చేయనున్నట్లు చెప్పారు. స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమన్నారు.
లబ్దిదారుల కలను నిజం చేయడం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా గృహ నిర్మాణాల్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 20 నెలల వ్యవధిలోనే మీ గృహాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు . రాష్ట్రంలో గత యేడాది 3 లక్షలు గృహ ప్రవేశాలు చేయగా, ఇందులో జిల్లాలో 12800 గృహ ప్రవేశాలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 2.50 లక్షల గృహాలు రాష్ట్రంలో గృహ ప్రవేశాలు చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా గృహాలు మంజూరు జరుగుతుందన్నారు. పట్టణ హౌసింగ్ స్కీం కింద రూ.2.50 లక్షలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రభుత్వం పట్టాలు ఇస్తే పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు వివరించారు. ఎపిఈఈడబ్యుఐడిసి డెరక్టర్ పిఎంజె బాబు, గృహ నిర్మాణ శాఖ పిడి రమాకాంత్, తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, ఎపిఈఈడబ్యుఐడిసి డెరక్టర్ పిఎంజె బాబు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పైడిశెట్టి జయంతి, డిఈ సత్యాజి, ఎఈ మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.
……
