అట్టహాసంలో మహాశక్తి పూజ..

అట్టహాసంలో మహాశక్తి పూజ..
- భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకం
- ఆకట్టుకున్న అమ్మవారి వేషధారణలు
- కుంభం కోసం పోటిబడ్డ భక్తులు
- తరలివచ్చిన భక్తజనం
గాండ్లపెంట, ఆంధ్రప్రభ : యోగి వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మహాశక్తి పూజ (కుంభాభిషేకం) అట్టహాసంగా సాగింది. ప్రతి యేటా మొదటిరోజు అనవాయితిగా నిర్వహించిచే మహాశక్తి పూజ ఇక్కడి ఆలయ పూజారులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆలయం ఎదుట వేపాకు పరిచి వాటిపై భక్తులు సమర్పించిన ఉడికించిన జొన్నలను వెదురు గంపలతో తీసుకొచ్చి రాసిగా పోశారు. అందులో వేపాకు, పసుపు కుంకుమ రాశిపై చల్లారు. అంతేకాకుండా రాశి పైన పూలతో అలంకరించారు. అనంతరం ఈ కుంభాన్ని తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఎగబడి పోటీపడ్డారు. అలాగే ఊరి చుట్టూ గ్రామదేవతకు బలి ఇచ్చారు. అనంతరం కళాకారులు చేపట్టిన దుర్గమ్మ, మహాకాళి అమ్మవారి వేషధారణలు మిన్నంటాయి.

భీకర రౌద్ర రూపంలో కళాకారులు చేపట్టిన అమ్మవారి వేషధారణలు ఇక్కడివారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా వేమన ఆలయం ఎదుట యువకులు రాతి గుండు పైకి ఎత్తుకొని విన్యాసాలు చేశారు. వేమన పీఠాధిపతి నంద వేమారెడ్డి ఆధ్వర్యంలో వేమన ఆలయం అంతా ప్రత్యేక పూలు, పండ్లతో సుందరీకరణ చేపట్టారు. దీంతో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేమన శిలా విగ్రహాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. అంతేకాకుండా రంగురంగుల విద్యుత్ దీపాలతో వేమన ఆలయం విరాజిల్లుతోంది. ఇక్కడ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.


