ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి

ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి
ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేకమైన బ్రాండ్‌గా ఉండాలి
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేకమైన బ్రాండ్‌గా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి గ్రామంలో రూర్బన్ ప్రాజెక్ట్ కింద నెలకొల్పిన మహిళా ఇక్కత్ హస్త కళా పరస్పర సహకార సంఘం సొసైటీ ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సభ్యుల తో మాట్లడి వారి సమస్యలు, ఉత్పత్తి విధానం, మార్కెటింగ్ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న షెడ్ సరిపోవడం లేదని ఇంకో షెడ్ ను ఏర్పాటు చేయాలని, బోర్ మోటార్ సౌకర్యం కల్పించాలని, ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వారు కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు నాణ్యతను పెంచుతూ, ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్ పద్ధతులను అవలంబించడం ద్వారా మన జిల్లాలో ఉత్పత్తి అవుతున్న ఇక్కత్ చీరలకు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకురావచ్చని సూచించారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉత్పత్తులను ఆన్‌లైన్ మార్కెట్లలో కూడా విక్రయించే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఇక్కత్ చీరలు ప్రత్యేకతను కాపాడుతూ ఒక బ్రాండ్‌గా నిలిపేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. పోచంపల్లి, కొయ్యలగూడెం ఇక్కత్ చీరలు, ఫాబ్రిక్ ఉత్పత్తులకు సంప్రదాయ నైపుణ్యం, ప్రత్యేక డిజైన్లు, నాణ్యతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవని, ఈ ప్రత్యేకతను మరింత బలోపేతం చేసి ఒక స్థిరమైన బ్రాండ్ ఇమేజ్ను సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకు సంబంధింత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రింటింగ్ చీరలకు, చేనేత చీరలకు గల తేడాలను సాటి చెప్పాలని అన్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇక్కత్ మహిళా సొసైటీ కి వారు కోరినట్లు అదనంగా మరొక షెడ్డుకు, బోర్ మోటార్ గురించి ఎస్టిమేట్స్ సిద్ధం చేసి ప్రతిపాదన లను పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా సొసైటీ కి హైదరాబాద్ లో శిల్ప రామారంలో ఒక షాప్ ను కేటాయించుటకు కృషి చేస్తానని, సొసైటీ ప్రత్యేక లోగో, లేబుల్ రూపోoదించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, కొయ్యలగూడెం గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, ఎల్లంబావి గ్రామ సర్పంచ్ గంజి వనజ కృష్ణ, అడిషనల్ డి ఆర్ డి ఓ సురేష్, చేనేత శాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ బలరాంరెడ్డి, ఎంపీడీవో సందీప్ కుమార్, మహిళా ఇక్కత్ సహకార సంఘం అధ్యక్షురాలు లత, కార్యవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
