లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి..

లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి..

కారకులపై కఠినచర్యలు తీసుకోవాలి

పెద్దపల్లి జిల్లా ముత్తారం, ఆంధ్రప్రభ : ముత్తారం మండల కేంద్రంలో వేధింపుల కారణంగా మృతిచెందిన కేతిరి లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కుటుంబ సభ్యులతోపాటు ఎరుకల కులస్తులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో లక్ష్మి, సారయ్యలు గత 40 ఏళ్లుగా నివాసముంటున్న ఇంటి స్థలంలో రామాలయం నిర్మించేందుకు ఇదే గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, కుమార్, రాజయ్య, సతీష్ లు ఒత్తిడి చేశారు.

అయితే లక్ష్మి అక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన మరోసారి వీరంతా భూమి కోసం వెళ్లగా, వేధింపులను తట్టుకోలేక లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. భర్త సారయ్య ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మి శుక్రవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులతోపాటు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గ్రామంలో ధర్నాకు దిగి ఆందోళన బాట పట్టిన వారంతా లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వేధింపులకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ పరంగా ఎక్స్ గ్రేషియా అందేలా చూడాలని కోరారు. కాగా, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేశ్ బాధితులకు మద్దతుగా నిలిచి లక్ష్మి మృతికి కారకులను శిక్షించి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply