తక్కువ నీటితో సాగు చేసే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
- ఆగ్రోనమీ శాస్త్రవేత్త గంగాదేవి
శావల్యాపురం, ఆంధ్రప్రభ: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేసే పంటలకు రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆగ్రోనమీ సీనియర్ శాస్త్రవేత్త డా.ఎమ్.గంగా దేవి అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన శావల్యాపురం రైతు సేవా కేంద్రం నందు మంగళవారం ఎల్ నినో పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆగ్రోనమీ శాస్త్రవేత్త గంగాదేవి, వినుకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సి.హెచ్.రవికుమార్ పాల్గొని రైతులకు తగు సలహాలు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా గంగాదేవి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ, శాస్త్రీయ సూచనలు పాటించి వాతావరణానుకూల వ్యవసాయం చేయాలని సూచించారు. సాగునీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఎల్ నినో అనేది మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ దృగ్విషయమని వివరించారు. దీని ప్రభావంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం తగ్గి, సాధారణం కంటే తక్కువ వర్షపాతం, దీర్ఘకాల పొడి వాతావరణ, అధిక ఉష్ణోగ్రతలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ, వాతావరణానుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో అధిక నీటి అవసరమున్న వరి, మొక్కజొన్న వంటి పంటల సాగును విస్తరించకుండా, తక్కువ నీటితో సాగు చేయగల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొర్రలు, సజ్జలు, రాగులు, సామలు వంటి చిరుధాన్యాలు, కంది, పెసర, మినుము, అలసంద వంటి పప్పుధాన్యాలు, నువ్వులు వంటి నూనెగింజల పంటలు తక్కువ నీటితో సాగుకు అనుకూలంగా ఉండటమే కాకుండా వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సహజ సామర్థ్యం కలిగి ఉంటాయని వివరించారు.
వర్షపాత వైవిధ్యాలను పరిగణలోకి ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్నినో పరిస్థితుల్లో నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పొలం గట్లను బలోపేతం చేయడం, కాంటూర్ బండింగ్, మల్చింగ్, సకాలంలో కలుపు నివారణ వంటి నేల సంరక్షణ చర్యలను చేపట్టాలని తెలిపారు. అలాగే బిందు (డ్రిప్), తుంపర (స్ప్రింక్లర్) సాగునీటి పద్ధతులను అనుసరించి ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించాలన్నారు.
ఫామ్ పాండ్ల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు..
వ్యవసాయ భూముల్లో వర్షపు నీటిని నిల్వ చేయడానికి, భూగర్భ జలాలను పెంచడానికి ఫామ్ పాండ్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. వర్షపు నీటిని సేకరించి అవసరమైన సమయంలో రక్షణాత్మక సేతపారుదలకు వినియోగించుకునేందుకు ఫామ్ పాండ్లను నిర్మించాలని తెలిపారు. ఫామ్ పాండ్లలో నిల్వ చేసిన నీటిని పంటల కీలక దశల్లో వినియోగించడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వివరించారు.
రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్నినో పరిస్థితుల్లో పంటల ప్రారంభ దశలోనే మంచిగా మొలకేత్తటం, ఆరోగ్యకరమైన మొక్కలు పెరుగుదల కోసం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని సూచించారు. శావల్యాపురం మండల వ్యవసాయ అధికారి వి.నరేంద్ర బాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.
