జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు

జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు
- వినియోగదారులు ఆందోళన చెందొద్దు
- డొమెస్టిక్ గ్యాస్ కమర్షియల్ గా వినియోగిస్తే పోలీసు కేసులు
- బుకింగ్ చేస్తేనే గ్యాస్ సరఫరా
- భువనగిరి ఆర్ డీఓ కృష్ణారెడ్డి
మోత్కూర్ , ఆంధ్రప్రభ : జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు, వినియోగదారులు ఆందోళన చెందవద్దని,ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా జరుగుతుందని భువనగిరి ఆర్ డి ఓ ఎం కృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 4 బీపీసీఎల్, 3 హెచ్ పీసీఎల్,13 ఐ ఓసీఎల్ కంపెనీలకు చెందిన మొత్తం 20 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని,అన్ని ఏజెన్సీలలో గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆయా గ్యాస్ ఏజెన్సీ లు నిత్యం గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే జిల్లా లో ఎస్పీ,కలెక్టర్, సివిల్ సప్లై,ఎన్ఫోర్స్ మెంట్ శాఖల తో సమావేశం జరిగిందని, డొమెస్టిక్ సిలిండర్ల కొరత ఎక్కడ కూడా లేదన్నారు. మోత్కూర్ లో నిన్న 686 గ్యాస్ బుకింగ్ కాగా అన్ని పంపిణీ చేశారని, ఈ రోజు 524 బుకింగ్ కాగా ఇప్పటికే ఆయా గ్రామాలకు ఆటోలలో సిలిండర్లు తరలించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు,గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధితో గ్యాస్ బుకింగ్ చేస్తున్నట్లు, వినియోగదారులు తప్పనిసరిగా బుకింగ్ చేస్తేనే గ్యాస్ ఇస్తారని, బుకింగ్ లేకుండా క్యూ లైన్ లో ఉంటే గ్యాస్ ఇవ్వరన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టల్ లు,అంగన్ వాడీ లలో గ్యాస్ కొరత లేదన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారులు అక్కడక్కడా వింయోస్తున్నారని ,ఎన్ఫోర్స్ మెంట్,రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో తనిఖీ లు నిర్వహించి డొమెస్టిక్ సిలిండర్ లు దుర్వినియోగ పరిస్తే సదరు వ్యక్తుల పై పోలీసు కేసులు నమోదు చేస్తామని ఆర్ డి ఓ హెచ్చరించారు.
ఆయా వ్యాపార కూడళ్లతో పాటు కమర్షియల్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా డొమెస్టిక్ సిలిండర్లు వాడకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఏరోజుకారోజు గ్యాస్ బుకింగ్,సరఫరా ,నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా లోకల్ వాట్సప్ గ్రూప్ ల్లో సమాచారం ఇవ్వాలని ఆర్ డి ఓ గ్యాస్ గోదాం ఇంచార్జ్ చిప్పలపల్లి యాదగిరి ని ఆదేశించారు. ఎక్కడైనా గ్యాస్ ధరలను ఏమ్మార్పీ కి మించి అదనపు వసూలు చేస్తే తన నెంబర్ 8331997004 కి స్వయంగా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
