మత్స్యకారుల పడవలపై ట్రాన్స్‌పాండర్‌ల ఏర్పాటు.. 

ఎంపీ మహేష్ యాదవ్ తో కేంద్ర మత్స్య శాఖా మంత్రి. 
ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు, పుదుచ్చేరి పడవల చొరబాటు…
ఏపీ లో గత 5 సంవత్సరాలలో సుమారు 160 అక్రమ చేపల వేట కేసులు…
‎రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులు దాటకుండా పడవలపై ట్రాన్స్‌పాండర్‌లు…
364 కోట్ల వ్యయంతో కమ్యూనికేషన్ వ్యవస్థ…


ఆగస్టు 4, ఆంధ్ర ప్రభ, ఏలూరు : మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళిన సమయంలో రాష్ట్ర సరిహద్దులు, అంతర్జాతీయ సరిహద్దులు దాటకుండా వేట కొనసాగించడం కోసం పడవలపై ట్రాన్స్‌పాండర్ లను అమర్చే ఒక ప్రాజెక్టును చేపట్టినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక అండ్ పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలియజేశారు. అక్రమ చేపల వేటను నివారించడానికి, మత్స్యకారులకు అవగాహన కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంగళవారం లోక్ సభలో కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.

‎మత్స్య సంపద అనేది రాష్ట్ర పరిధిలోని అంశంగా ఉన్నప్పటికీ, ప్రతి తీర ప్రాంత రాష్ట్రం బేస్‌లైన్ నుండి 12 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాదేశిక జలాల్లో చేపల వేట కార్యకలాపాల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం “సముద్ర మత్స్య నియంత్రణ చట్టాన్ని (ఎం ఎఫ్ ఆర్ ఏ)” రూపొందించిందని చెప్పిన కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లో అక్రమ చేపల వేటను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య నియంత్రణ చట్టం (ఏపీ ఎం ఎఫ్ ఆర్ ఎ), (ఏపీ-ఎమ్ ఎఫ్ ఏ) నిబంధనలు కూడా అమలు చేయబడుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా, సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైసెస్ (టి.ఈ.డి) వాడకాన్ని తప్పనిసరి చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

‎ఇతర రాష్ట్రాల మత్స్యకారులు తరచుగా ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి చొరబడుతున్న అంశంపై ఎంపీ మహేష్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దక్షిణ తీర జిల్లాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు, పుదుచ్చేరి నుండి యంత్రాలతో నడిచే చేపల పడవలు నిరంతరం చొరబడుతున్న మాట వాస్తవమేనన్నారు. గత 5 సంవత్సరాలలో సుమారు 160 అక్రమ చేపల వేట కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2022-23లో శ్రీకాకుళం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో 21 చేపల పడవల నుండి రూ. 52,500 జరిమానా వసూలు చేసినట్లు, 2024-25లో బాపట్ల జిల్లాలో 3 చేపల పడవల నుండి రూ. 7500 వసూలు చేసినట్లు తెలిపారు.

‎అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐ.ఎమ్.బి.ఎల్)ను దాటకుండా నివారించడంపై మత్స్యకారులకు అవగాహన కల్పించేందుకు, భారత మత్స్య శాఖ (డి.ఓ.ఎఫ్) తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేస్తుంది. అంతేకాకుండా, భారత నౌకాదళం, భారత తీరరక్షక దళం తీరప్రాంత గ్రామాలలో మత్స్యకారులకు ఐ.ఎమ్.బి.ఎల్ తో పాటు ఇతర భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించడానికి  కమ్యూనికేషన్, సహాయక వ్యవస్థ (వి.సి. ఎస్ ఎస్)ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి (పి ఎం ఎం వై) కింద మొత్తం రూ. 364 కోట్ల వ్యయంతో ఒక ప్రాజెక్టును ఆమోదించిందినట్లు మంత్రి చెప్పారు. ఈ ట్రాన్స్‌పాండర్‌లను 100శాతం ప్రభుత్వ సహాయంతో మత్స్య పడవలలో అమర్చు తున్నారు. ఈ ట్రాన్స్‌పాండర్‌లలో జియో-ఫెన్సింగ్ ఫీచర్లు ఉన్నాయని, ఇవి మత్స్యకారులు అధీకృత చేపల వేట ప్రాంతాలకు సమీపించినప్పుడు లేదా వాటిని దాటినప్పుడు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, రాష్ట్ర సరిహద్దులు దాటడాన్ని లేదా అనధికారిక చేపల వేటను నిరోధిస్తాయని కేంద్ర మంత్రి వివరించారు.