రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయొద్దంటూ నిరసన
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ రీసైక్లింగ్ యూనిట్ ను మా గ్రామంలో ఏర్పాటు చేస్తే అస్సలు సహించమని పాంనూరు గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ మండ లం పామునూరు గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాల యం ముందు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ ఆవేదనను మీడియాతో పంచుకున్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన రీసైక్లింగ్ యూనిట్‌ను తమ గ్రామంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ముఖ్యంగా ఇళ్ల పక్కనే యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరమని వారు మండిప డ్డారు. ఈ యూనిట్ వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.
దీంతో గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అధికారులు ఇక్కడే యూనిట్ ఏర్పాటు చేస్తామని పట్టుబడితే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని గ్రామస్థులు హెచ్చరించారు. తమ గ్రామంలో రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయకూడదని గ్రామస్థులు, రైతులు స్పష్టం చేశారు.
