విమర్శల కంటే.. ప్రగతే ప్రజల మనసులను గెలుచుకుంటుంది..!
ఎంపీ లావు శ్రీకృష్ణ మాట..
నరసరావుపేట (ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణం మాటలకు అతీతంగా, చేతల్లో కనిపిస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. రాజకీయ విమర్శల కంటే ఆచరణలో చూపించే ప్రగతే ప్రజల మనసులను గెలుచుకుంటుందన్నది ఎంపీ మాట.
రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక లోటుల సుడిగుండంలో చిక్కుకున్న ఒక రాష్ట్ర ప్రజల జీవితాలు మళ్లీ నిలదొక్కుకోవాలంటే కేవలం మాటలు సరిపోవు… కొండంత సంకల్పం, దార్శనికత కలిగిన నాయకత్వం అవసరం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా ఇదే బాటలో ప్రయాణిస్తూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేస్తోందని ఎంపీ న్యూఢిల్లీ వేదికగా స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం, ఎలాంటి వడ్డీ లేకుండా సుదీర్ఘ కాలానికి అందించే సాయమే సస్కి (SASCI) నిధులు. ఈ నిధులు కేవలం కాగితాలపై ఉండే లెక్కలు మాత్రమే కావు… గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే మంచి రహదారులు, మన యువతకు ఉపాధి చూపే పోర్టులు, ప్రాంతీయ వైభవాన్ని పెంచే పర్యాటక రంగాలు! 2020 నుంచి ప్రతీ రాష్ట్రానికి అందుబాటులో ఉన్న ఈ నిధులను సాధించడంలో నిన్నటికి, నేటికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల కాలంలో (2020-2024) సాధించగలిగింది కేవలం రూ.11,386 కోట్లు మాత్రమే అయితే, చంద్రబాబు నాయుడు పట్టుదల, నిరంతర ప్రయత్నాల వల్ల కేవలం రెండేళ్లన్నరలోపే ఏకంగా రూ.19,619 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం సాధించగలిగిందన్నారు.
ఢిల్లీ వేదికగా పార్లమెంట్ ద్వారా బయటపడిన ఈ అధికారిక నిజాలు, అభివృద్ది పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని నిరూపిస్తున్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు దాదాపు రూ.16,000 కోట్లకు పైగా ఉన్న రెవెన్యూ లోటుతో ప్రయాణం ప్రారంభించిన మన రాష్ట్రానికి, ఇలాంటి కేంద్ర నిధులు ఎంతటి ప్రాణవాయువో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రయోజనం లేని విమర్శలకు సమాధానంగా, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా సాగుతున్న ఈ ప్రగతి ప్రయాణం ప్రతీ ఒక్కరిలో కొండంత ఆశను, నమ్మకాన్ని నింపుతోందన్నది వాస్తవమన్నారు.
