గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం…

గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం…
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సర్పంచ్ బండారి చందర్ రావు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పరిసరాలను గ్రామపంచాయతీ సిబ్బంది శుభ్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ బండారి చందర్ రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థుల సహకారంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పల్లె ప్రకృతి వనం గ్రామ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే ప్రదేశమని, అందరూ కలిసి దానిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. గ్రామంలో తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుందని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులను కోరారు.

ముఖ్యంగా మహిళలు స్వచ్ఛత కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటే గ్రామ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
