Vajpayee | ఖమ్మం సభలో సంచలన వ్యాఖ్యలు

Vajpayee | ఖమ్మం సభలో సంచలన వ్యాఖ్యలు

కులం కంటే గుణమే మిన్న.. విలువల్లేని రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ఆవేదన
అమ్మను పరభాషలో పిలిస్తే శవంతో సమానం.. మాతృభాష ప్రాధాన్యతపై ఉద్ఘాటన
తక్షణ ఆహారంతో నిరంతర రోగాలు.. పాశ్చాత్య సంస్కృతిపై యువతకు దిశానిర్దేశం
క్రమశిక్షణే అత్యున్నత పదవులకు సోపానం.. తన రాజకీయ ప్రస్థానాన్ని నెమరువేసుకున్న వెంకయ్య నాయుడు.

Vajpayee | ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని అద్భుతమైన వక్త, రచయిత, కవి, ప్రజాస్వామ్యవాది, గొప్ప దేశభక్తుడు అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన వాజ్‌పేయి శతజయంతి పుస్తకావిష్కరణ సభలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవుల కోసం పీఠాల కోసం వాజ్‌పేయి ఎప్పుడూ రాజీపడలేదని, ఓటమిని సైతం అత్యంత హుందాగా స్వీకరించిన గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం అని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన మనసుతో దేశ సేవ చేయాలని ఆకాంక్షించిన గొప్ప నాయకుడు ఆయన అని ప్రశంసించారు.

వాజ్‌పేయి హయాంలోనే దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రహదారుల అనుసంధానం, సమాచార ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రపంచ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి వాజ్‌పేయి అని ఉద్ఘాటించారు. దేశంలో ఒకే విధానం ఉండాలనే శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా కాశ్మీర్‌లో కల్పిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ఒక గొప్ప చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు.

Vajpayee |

వాజ్‌పేయి పాలనా దక్షత, నిస్వార్థ సేవ నేటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. గతంలో జనసంఘ్, కమ్యూనిస్ట్, కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ వంటి రాజకీయ పక్షాలకు ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం ఉండేదని, నేటి రాజకీయాల్లో ఆ సిద్ధాంతాలు పూర్తిగా లోపించాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు కేవలం అవకాశవాదంతో పక్షాలు మారుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కులము కన్నా గుణము మిన్న అని స్పష్టం చేస్తూ రాజకీయాల్లో కులం, ధనం, మతం, నేరచరిత్ర ఆధారంగా కాకుండా నాయకుడి వ్యక్తిత్వం, సామర్థ్యం, యోగ్యత, ప్రవర్తన చూసి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని సూచించారు.

Vajpayee |

ప్రస్తుత ప్రసార మాధ్యమాలు కేవలం వివాదాలకు ఇస్తున్న ప్రాధాన్యత సమాజానికి మేలు చేసే మంచి విషయాలకు ఇవ్వడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో మంచిని ప్రోత్సహించే బాధ్యత పత్రికలదే అని హితవు పలికారు. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలవని ఆయన విశ్లేషించారు. ప్రతి ఇంట్లో పిల్లలు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలని స్పష్టం చేశారు. పరభాషా పదమైన అమ్మను సూచించే ఆంగ్ల పదం వాడితే వస్తుప్రదర్శనశాలలో పెట్టే శవం అని అర్థం వస్తుందని, అమ్మ, నాన్న అని పిలవడంలో ఉన్న కమ్మదనం ఆంగ్ల పదాల్లో ఏమాత్రం లేదని చురకలంటించారు.

ఇతర భాషలు నేర్చుకోవద్దు అనడం లేదని, ప్రాధాన్యత మాత్రం కచ్చితంగా ముందు మాతృభాషకే ఇవ్వాలని సూచించారు. మాతృభాష కళ్లు లాంటిదని, పరభాష కళ్లద్దాలు లాంటిదని విశ్లేషించారు. హిందుత్వం అంటే ఒక ఇరుకైన మతం కాదని, ఎవరినీ ద్వేషించని ఒక గొప్ప జీవన విధానం, అత్యంత విశాలమైన సంస్కృతి అని ఆయన వివరించారు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటాను కలిగి ఉండి విశ్వగురువుగా వెలుగొందిందని, మన దేశం సుదీర్ఘ చరిత్రలో ఎప్పుడూ ఇతర దేశాలపై దండెత్తలేదని గుర్తు చేశారు. భారతీయ సనాతన ధర్మం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుందని ఉద్ఘాటించారు. తాత్కాలిక రుచుల కోసం పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బానిసలైతే భవిష్యత్తులో నిరంతరం దీర్ఘకాలిక రోగాల బారిన పడక తప్పదని యువతను హెచ్చరించారు.

తక్షణమే తయారయ్యే ఆహారం తింటే నిరంతర రోగాలు వస్తాయని, సహజసిద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. నిత్యం యోగా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శారీరక ధారుడ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ఆధునిక సాంకేతికత ఎంత పెరిగినా కృత్రిమ మేధస్సుకు మానవ మేధస్సు, భావోద్వేగాలు ఉండవని, దాని పరిమితులు తెలుసుకొని వాడుకోవాలని తెలిపారు. సమాచార సాంకేతికతను మానవళి అభివృద్ధి కోసం వాడుకోవాలి తప్ప వినాశనానికి కాదని స్పష్టం చేశారు. పిల్లలు దూరదర్శిని, చరవాణులు విపరీతంగా చూడటం వల్ల అనేక అనర్థాలు వస్తాయని, వాటి వాడకాన్ని కచ్చితంగా నియంత్రించాలని తల్లిదండ్రులకు సూచించారు.

శారీరక శ్రమ లేకపోవడం వల్లే అనేక రుగ్మతలు దరిచేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితం ఒక సాధారణ రైతు కుటుంబం నుండి ప్రారంభమైందని, చిన్న వయసులో ఆటలు ఆడటానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖకు వెళ్ళడం ద్వారా తనలో క్రమశిక్షణ, దేశభక్తి మొలకెత్తాయని ఆయన తన గతాన్ని నెమరువేసుకున్నారు. వాజ్‌పేయి, అద్వానీ లాంటి గొప్ప నాయకుల మార్గదర్శకత్వంలో పనిచేశానని తెలిపారు. సాధారణ రాజకీయ కార్యకర్త స్థాయి నుండి మంత్రిగా, జాతీయ అధ్యక్షుడిగా, అత్యున్నతమైన భారత ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించానంటే దానికి ప్రధాన కారణం కేవలం క్రమశిక్షణ, వ్యవస్థ అందించిన ప్రోత్సాహమే అని వినయంగా తెలియజేశారు.

నిరంతరం నేర్చుకునే తపన ఉంటే ఎంతటి ఎత్తైనా ఎదగవచ్చని, యువత కూడా అదే బాటలో నడవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పత్రికా విలేకరులు కూడా సమాజ హితం కోరే వార్తలు రాయాలని కోరారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపు రాజు రామచంద్రరావు మాట్లాడుతూ నేటి రాజకీయ వాతావరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

వాజ్‌పేయి మాటలు, ప్రసంగాల స్ఫూర్తితో ఎంతో మంది యువత రాజకీయాల్లోకి, సాహిత్యంలోకి వచ్చారని తెలిపారు. నాడు దూరదర్శన్‌లో వాజ్‌పేయి ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసేవారని గుర్తుచేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, చట్టసభల సభ్యుడిగా, ప్రధానమంత్రిగా ఎలా ఉండాలో వాజ్‌పేయి దేశానికి చూపించారని రామచంద్రరావు కొనియాడారు. తాను శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనప్పుడు సభలో అసభ్య పదజాలం వాడకూడదని, సభా వేదిక వద్దకు వెళ్లకూడదని వెంకయ్య నాయుడు, వి. రామారావు తనకు సూచించారని తెలిపారు.

నేటి రాజకీయాల్లో ఆరోగ్యకరమైన విమర్శలకు బదులు బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. శాసనసభలలో వస్తువులు పగులగొట్టడం, బట్టలు చించుకోవడం లాంటివి చేస్తున్నారని, తెలంగాణలో ఈ బూతుల సంస్కృతి పోవాలని హితవు పలికారు. వాజ్‌పేయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు కాశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు ఆయనను ఐక్యరాజ్యసమితికి పంపడం మన దేశ ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం అని ప్రశంసించారు. వాజ్‌పేయి ఒక గొప్ప కవి అని, ఆయన రాసిన గీతాలను ప్రముఖ గాయకుడు జగ్జీత్ సింగ్ పాడారని గుర్తుచేశారు. కవితా సంకలనాన్ని తీసుకువచ్చిన ఖమ్మం వాసి వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు.

వాజ్పేయి శతజయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, మందడపు ప్రభాకర్ రెడ్డి, లతోపాటు కార్యక్రమంలో సామాజిక సమరసత జాతీయ కళా విభాగం కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అప్పల ప్రసాద్ జి, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి , కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి భాస్కరరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply