5 ఏ ఎస్ పిటి 1 వివాదాస్పద భూములు
5 ఏ ఎస్ పిటి 1 వివాదాస్పద భూములు
- వారసత్వాల ముసుగులో కోట్లాది రూపాయల అక్రమం
- నారంవారిగూడెంలో 44 ఎకరాల్లో అక్రమ మ్యూటేషన్ లు
- చేతులు మారిన లక్షలాది రూపాయలు
- అక్రమ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లు కూడా జారీ
- సమగ్ర సర్వే నిర్వహిస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగులో
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : ఏజెన్సీలోని1/70 చట్టాలను తుంగలో తొక్కి సుమారు 44 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన భూమిని గిరిజనేతరులు ఏజెన్సీలోనకిలీ వారసత్వలను పొంది వాటికి పాస్ బుక్కులు కూడా పొందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.2011-12 సంవత్సరంలో సదరు ప్రబుద్ధులు భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి భూములు ఒకటే కొనుగోలు చేస్తే సరిపోదు కదా దానికి తోడు రికార్డులు కూడా మారాలి కదా దీంతో అప్పుడు రెవెన్యూ అధికారులను అడ్డంపెట్టుకుని పూర్తి నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలో అక్రమ వారసత్వాలను పొందినట్లు సమాచారం. దీనికిగాను ప్రబుద్ధులు ఎవరైతే భూమిని కొనుగోలు చేశారో అప్పటివరకు ఉన్న పట్టేదారు కి నకిలీ వారసత్వాలను ఎంచక్కా సృష్టించేశారు.
వాస్తవానికి 1970 ఫిబ్రవరి మూడు తర్వాత ఏజెన్సీలో గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య భూ విక్రయాలు నిషేధం. కానీ పట్టేదారుల నుండి కొనుగోలుదారులు నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లను సంపాదించి అడ్డగోలుగా వారసత్వాలను పొందేశారు. వారసత్వాలను పొందటమే తరువాయి రెవిన్యూలో రికార్డులు క్షణాల్లో మారిపోయాయి. అశ్వారావుపేట లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అయితే ఏజెన్సీలో 2012 లో భూమిని కొనుగోలు చేసి అప్పటివరకు రికార్డుల్లో ఉన్న పట్టేదారుని అత్తగా చూపిస్తూ ఆమె నుండి తన భార్యకు పసుపు కుంకుమ కింద భూమి వచ్చినట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఎంచక్కా భూమిని స్వాధీనం చేసుకోవటమే కాకుండా రెవెన్యూ రికార్డులను కూడా పొందారు.
ఇంకేముంది రెవెన్యూ రికార్డులు పొందడంతో తెలంగాణ ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో నూతన పాస్ పుస్తకాలు మంజూరు చేయగా సదరు ప్రబుద్ధుడు తానుకొన్న భూమికి డిజిటల్ పాస్ పుస్తకాలను కూడా కైవసం చేసుకుని దర్జాగా మహారాజ పోషణ వెలగబెడుతున్నారు. ఇలాగ ఏజెన్సీలో నారం వారి గూడెం రెవెన్యూ మౌజలో ఏడు ఎనిమిది మంది ఇదే తంతుగా అక్రమ లావాదేవీలు నిర్వహించి డిజిటల్ పాస్ పుస్తకాలను కూడా సంపాదించారు. భూమిని కొనుగోలు చేయడం ఆ తర్వాత వారసత్వం లేకపోయినా అక్రమంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను సంపాదించడం ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించటం ఆఖరి అంశం డిజిటల్ పాస్ పుస్తకం పొందటం ఇవన్నీ పైన పేర్కొన్న వారికి చకచకా జరిగిపోయాయని చెప్పవచ్చు.
అయితే ఇక్కడ రికార్డుల మార్పిడిలో జరిగిన తప్పిదాలకు గాను లక్షల రూపాయలు చేతులు మారాయి అన్న విషయం సుస్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రెవెన్యూ వారు 100 గజాల భూమిని అధికారికంగా మైదాన ప్రాంతంలో కొంటేనే రికార్డుల్లోకి ఎక్కించడానికి ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరగాలి కానీ ఇక్కడ ప్రబుద్ధులకు మాత్రం నెలల వ్యవధిలోనే అక్రమ సర్టిఫికెట్లు రికార్డులు మొత్తం కూడా చకచక జరిగిపోయాయి అంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ వారసత్వాలు బాగోతం ఇప్పుడు బయటకి వచ్చేసరికి అక్రమార్కులు ఉలికి పాటు వ్యక్తం చేస్తున్నారు. ఏ నిమిషం ఎవరు బాగోతం బయటపడుతున్నానని అక్రమార్కులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడమే కాకుండా బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా నారం వారి గూడెం రెవెన్యూ మౌజలో జరిగిన ఈ అక్రమ వారసత్వ భాగోతాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని రెవెన్యూ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
