తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- భట్టి విక్రమార్క
ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణహిత ఇంధన వనరులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
అంతకుముందు చిన్నబీరవల్లి గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్‌లో భాగంగా ఇంటింటి పైకప్పులపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం గార్లపాడు గ్రామంలో రైతు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్లను ప్రారంభించారు.
రాష్ట్రంలో మొదటిసారిగా బోనకల్, కొడంగల్ మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణ సోలరైజేషన్ మండలాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్లు కేవలం సాగునీరు అందించడమే కాకుండా, మిగులు విద్యుత్ ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పిస్తాయని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ ఖర్చు తగ్గడంతో పాటు నెలవారీగా సుమారు రూ.500 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. రెడ్కో రూపొందించిన ప్రత్యేక సోలార్ షెడ్లు పొలాల్లో విద్యుత్ ఉత్పత్తికి, రైతులకు విశ్రాంతి గదులుగా, సామాగ్రి నిల్వకు ఉపయోగపడతాయని అన్నారు.
బోనకల్ మండలంలో రూఫ్‌టాప్ సోలార్ పనులు 40 నుంచి 50 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్ల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగంగా సాగుతోందన్నారు. తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఈ ప్రాజెక్టులు మైలురాళ్లుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళా సంఘాలకు సోలార్‌తో ఆర్థిక చేయూత
ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఈ ప్లాంట్ల నిర్వహణ, యాజమాన్య బాధ్యతలను మహిళలే చూసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.
ఈ సోలార్ ప్రాజెక్టుల ద్వారా మహిళా సంఘాలకు ఏడాదికి రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంఘాలకు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రంలో దాదాపు 81 గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా ప్రకటించి పనులు వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, గృహ వినియోగదారులు సోలార్ పథకాలను వినియోగించుకుని పంటతో పాటు విద్యుత్ ద్వారా ఆదాయం పొందాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ రంగంలో సంస్కరణలు
నాణ్యమైన విద్యుత్ అందించడం ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ రంగంలో అధునాతన సాంకేతికతను ప్రజలకు చేరువ చేస్తూ, వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎక్కడా అంతరాయం కలగలేదన్నారు. 2023-24లో విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం అది 18,542 మెగావాట్లకు చేరిందని తెలిపారు.
రెండున్నరేళ్లలో సుమారు 3,542 మెగావాట్ల అదనపు డిమాండ్ పెరిగినా ప్రజలకు పవర్ కట్‌లు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ ఉత్పత్తిని అంచనాలకు అనుగుణంగా పెంచడం జరిగిందన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు.
తడిసిన ధాన్యాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కళ్లాల్లో రైతుల కన్నీళ్లు చూడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతోనే ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఆర్థిక శాఖ నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అదనంగా రూ.17,000 కోట్ల ప్రయోజనం చేకూరిందని తెలిపారు.
కేంద్రంపై భట్టి విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని భట్టి విక్రమార్క అన్నారు. గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా సరైన స్పందన రాలేదని విమర్శించారు.
కళ్లాల్లో పర్యటిస్తున్న బీజేపీ నాయకులు కేంద్రం ఎందుకు ధాన్యాన్ని సేకరించడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కొనుగోలు చేసిన ప్రతి గింజను కేంద్రం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
ఖరీఫ్ 2025-26లో కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం విధించగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని తెలిపారు. రబీ 2025-26కు సంబంధించి కేంద్రం 51.60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందన్నారు. సీజన్ చివరి నాటికి 75 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు.
కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ప్రతిపక్షాలపై ధ్వజం
ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలు, కొన్ని పత్రికలు వాస్తవాలను గమనించాలని భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు అండగా ఉండటంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు వార్తల్లో ఉండేందుకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల పాలన చూసిన ప్రజలే బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించారని అన్నారు. రైతులకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచిని బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ పదేళ్లలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అంత కొనుగోలు చేసిందని చెప్పారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన గౌరవాన్ని కాపాడుకోవాలని హరీశ్ రావుకు సూచించారు.
రైతులకు ప్రోత్సాహం
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క అన్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు ఈసారి ధాన్యానికి మద్దతు ధరపై అదనంగా బోనస్ ఇస్తోందన్నారు.
గత పదేళ్లుగా నిలిచిపోయిన మొక్కజొన్న కొనుగోళ్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని చెప్పారు. మద్దతు ధరతో కొనుగోలు చేయడం వల్ల మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.25,000 వరకు లాభపడ్డారని తెలిపారు.
రాష్ట్ర వనరులన్నింటినీ రైతులు, నిరుద్యోగ యువత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, రెడ్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీ అనిల, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
