ఫలించిన సాధన కమిటీ కృషి..

ఫలించిన సాధన కమిటీ కృషి..

పట్టణానికి మణిహారం కానున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలో దశాబ్దకాలంగా నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలం త్వరలో ప్రజలకు ఉపయోగపడే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌గా మారనుంది. చీరాల రోడ్డులో దాత మద్ది లక్ష్మయ్య సహకారంతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగాక పాత ప్రభుత్వ ఆసుపత్రి క్రమంగా శిథిలావస్థకు చేరింది. గదులు నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. అనంతరం గదులను తొలగించడంతో స్థలం ఖాళీగా మిగిలిపోయింది.

ప్రజాభిప్రాయం

పట్టణ నడిబొడ్డులో ఉన్న ఈ పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలం నిరుపయోగంగా ఉండటంపై ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ స్థలం గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్) ఆధీనంలో ఉండటం, అలాగే వైద్య సేవలకే వినియోగించాలని దాతలు షరతులతో దానం చేయడంతో ఇతర శాఖల ప్రయత్నాలు నిలిచిపోయాయి. పార్కింగ్ స్థలంగా మార్చే యత్నం కూడా ఫలించలేదు.

తల్లి–పిల్లల ఆసుపత్రి సాధన కమిటీ పోరాటం

గత రెండు సంవత్సరాలుగా సీనియర్ నాయకులు చేవూరి కృష్ణమూర్తి, షేక్ జమాల్ బాషా, పేలూరి రామారావు, నాయుడు శివకుమార్ తదితరులు కలిసి ‘తల్లి–పిల్లల ఆసుపత్రి సాధన కమిటీ’గా ఏర్పడి ఈ స్థలంలో తల్లి–పిల్లల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. నిరంతరం ఉద్యమించారు. పలుమార్లు ప్రభుత్వ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కు వినతిపత్రాలు సమర్పించారు.

ఎమ్మెల్యే ప్రత్తిపాటి విశేష స్పందన..

ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం శాసన సభ్యులు ప్రత్తిపాటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజాదర్బార్‌లో కమిటీ సభ్యులు వినతిపత్రం అందించగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి సానుకూలంగా స్పందించారు. మానుకొండూరు–వారిపాలెం గ్రామానికి మంజూరైన అర్బన్ హెల్త్ సెంటర్ కోర్టు పరిధి సమస్యల కారణంగా అక్కడ నిర్మాణం జరగకపోవడంతో, అదే కేంద్రాన్ని చిలకలూరిపేటకు మళ్లించేందుకు కృషి చేశారు. ఆయన చొరవతో ఈ స్థలంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని కృషితో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.45 కోట్ల వ్యయంతో నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. సాధన కమిటీ ధన్యవాదాలు.. సాధన కమిటీ సభ్యులు తమ ఉద్యమం ఫలించినందుకు హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజల ఆకాంక్ష… నెరవేరుతున్నదని తెలిపారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానికి అభినందనలు తెలిపారు.

  1. పట్టణ ప్రధాన కూడలిలో దశాబ్దకాలంగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలం.
  2. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కు వినతిపత్రం అందజేస్తున్న తల్లి–పిల్లల ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు.
  3. చేవూరి కృష్ణమూర్తి
    4.షేక్ జమాల్ బాషా
  4. పేలూరి రామారావు
  5. నాయుడు శివకుమార్

సాధన కమిటీ సభ్యుల అభిప్రాయాలు..

చేవూరి కృష్ణమూర్తి:

“ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న స్థలం మా పోరాటంతో ప్రజలకు ఉపయోగపడబోతోంది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఉద్యమాన్ని ప్రారంభించాం.”

షేక్ జమాల్ బాషా:

ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రి చీరాల రోడ్డులో దూరంగా ఉండటంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పట్టణ నడిబొడ్డులో ఆసుపత్రి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.”

పేలూరి రామారావు:

జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సమీపంలో ఆసుపత్రి ఉంటే క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.”

నాయుడు శివకుమార్:

పట్టణ ప్రజలకు సులభ రాకపోకలు, మెరుగైన వైద్య సేవలు అందేలా ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవడం కూడా మన బాధ్యత..

Leave a Reply