Short circuitతో ఇల్లు దగ్ధం

Short circuitతో ఇల్లు దగ్ధం

రూ. 6 లక్షల ఆస్తి నష్టం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ పేద కుటుంబం నిలువునా రోడ్డున పడింది. గ్రామానికి చెందిన ఇప్ప లత (భర్త స్వర్గీయ శ్రీనివాస్) మహాలక్ష్మి నగర్‌లోని తన నివాసంలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఇంటిలోని టీవీ, కూలర్, ఫ్రిడ్జ్, ఫ్యాన్‌తో పాటు నిత్యావసర వస్తువులు, బట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో బీరువాలో దాచుకున్న రూ. 50 వేల నగదు, అరతులం బంగారం మంటలకు ఆహుతయ్యాయి. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే.. లత కుమారుడికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా కాలిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. సుమారు రూ. 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త లేని పేద కుటుంబానికి ఇలా జరగడంపై గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, దాతలు తమకు తోచిన సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply