కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు
మంత్రాలయం, ఆంధ్రప్రభ : కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖా మంత్రి హెచ్.డి. కుమారస్వామికి సోమవారం మంత్రాలయంలో నాయకులు, మఠం పెద్దలు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని మంత్రి భక్తిశ్రద్ధలతో దర్శించారు. గురు వైభవోత్సవాల సందర్భంగా ఆదివారం మంత్రాలయానికి విచ్చేసిన మంత్రి, ఉత్సవాలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
ఆదివారం రాత్రి మంత్రాలయంలో బస చేసిన మంత్రి, సోమవారం గురు వైభవోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి శేషవస్త్రం కప్పి, ఫలమంత్రాక్షతలు, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. శ్రీమఠంలో జరిగిన కార్యక్రమాలు భక్తి భావనతో, శ్రద్ధాసక్తులతో కొనసాగాయి. మంత్రాలయ పుణ్యక్షేత్ర మహిమను మంత్రి కొనియాడుతూ, దేశ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకున్న కుమారస్వామికి అధికారులు, ప్రజాప్రతినిధులు, మఠం పెద్దలు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, తాసిల్దార్ రమాదేవి, మఠం పెద్దలు, నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



