Choutuppal | బోర్ ను ప్రారంభిస్తున్న ఈఎల్వి భాస్కర్..

Choutuppal | బోర్ ను ప్రారంభిస్తున్న ఈఎల్వి భాస్కర్..
Choutuppal, ఆంధ్రప్రభ : యాదాద్రి, భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఇఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ తెలిపారు. ఆయన 18వ వార్డులో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు సొంత ఖర్చుతో కొత్త బోరు బావిని వేయించారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్ గెలుపు కోసం సహకరించిన భాస్కర్, ఆ సమయంలోనే ఒక హామీ ఇచ్చారు. “నువ్వు గెలిచి వస్తే వార్డు అభివృద్ధికి నా వంతు తోడ్పాటు అందిస్తాను. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో అండగా ఉంటాను” అని భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే, వార్డులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని కౌన్సిలర్ సురేష్ ఆయన దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించి బోరు వేయించారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు త్వరలోనే వార్డులో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వార్డులో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలోని ఏ వార్డులో సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావచ్చని ఆయన తెలిపారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి 100 పడకల విస్తరణను ప్రభుత్వం, మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని కోరారు. మెరుగైన వైద్యం అందక సామాన్య ప్రజలు హైదరాబాద్ వంటి నగరాలకు పరుగులు తీయాల్సి వస్తోందని, వర్షాకాలం లోపే ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానికులకు పెద్ద ఊరట లభిస్తుందని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అనే మూడు అంశాలు ప్రతి పేదవాడికి అందాలన్నదే ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ప్రధాన సంకల్పమని ఆయన తెలిపారు.
కౌన్సిలర్ బుడ్డ సురేష్ మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజల కోసం ఇ ఎల్ వి భాస్కర్ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, సొంత నిధులతో వార్డు సమస్యలను పరిష్కరిస్తున్న భాస్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
