తెల్లవారుజామున జాతీయ రహదారిపై కలకలం

కోదాడ, ఆంధ్రప్రభ ; సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు నొప్పులతో బాధపడుతుండగా, ఇతర ప్రయాణికులు భయంతో బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు.

బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. తెల్లవారుజామున సమయంలో అలసట కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు వారు తెలిపారు.

సమాచారం అందుకున్న కోదాడ టౌన్ సీఐ శివశంకర్ నాయక్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని 108 అంబులెన్స్ ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply