ఊరూర శివయ్యకు వైభవంగా అభిషేకాలు

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా మక్తల్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ ఉమా మహేశ్వరాలయం ,శ్రీ కుంబేశ్వరాలయం, శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం ,శ్రీ ఈశ్వరాలయం,శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం తో పాటు ఊరూర శివాలయాల్లో వైభవంగా అభిషేకాలు చేయించారు. భక్తులు పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీ ఉమామహేశ్వరాలయం లో తెల్లవారుజామున మూడు గంటల నుండి మధ్యాహ్నం వరకు స్వామివారికి ఆలయ అర్చకులు తిప్పయ్య స్వామి,సిద్ద రామయ్య స్వామి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం చేయించారు.

పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేయించారు. అభిషేకాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద భక్తులు క్యూ కట్టారు. దర్శనం కోసం గంట నుండి రెండు గంటల వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పలువురు భక్తులు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉపవాస దీక్షలతో శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. రోజంతా శివాలయాల వద్ద భక్తుల ఓంకార నాదం శివనామస్మరణతో శివాలయాలు గ్రామాలు మారుమోగాయి. ఎక్కడ చూసినా భక్తిభావం ఉట్టిపడింది.

పెద్దలు మహిళలు వృద్ధుల కాకుండా చిన్నారులు సైతం ఆలయాలకు తరలివచ్చి పరమశివుడిని దర్శించుకున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టారు. దర్శనం కోసం గంటల కొద్ది నిలబడిన భక్తులు ఓంకార నాథంతోపాటు ఓం నమః శివాయ అంటూ చేసిన శివనామస్మరణ మారుమోగింది.గ్రామ గ్రామాన శివాలయం వద్ద భక్తులు అభిషేకాలు భజనలు కొనసాగాయి. మండలంలోని పసుపుల వద్ద పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన శ్రీక్షేత్ర శ్రీ వల్లభ పురం దత్త క్షేత్రం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దత్త పీఠం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రాఘవేంద్ర శివాలయంలో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చి పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శివుడికి అభిషేకాలు నిర్వహించారు.

అదేవిధంగా అన్నపూర్ణాదేవిని, శ్రీ శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ (విఠల్ బాబా)గురు మందిరాన్ని దర్శించుకున్నారు. ఆయా ఆలయాల వద్ద స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు .ఈ వేడుకల్లో శ్రీ ఉమా మహేశ్వరాలయం ఆలయ కమిటీ సభ్యులు అక్కల సత్యనారాయణ, బి. ఆంజనేయులు సూర్య,సివి.ఆంజనేయులు, పోలేపల్లి అనంతకుమార్, చిన్న కృష్ణయ్య,బి.శ్రీనివాసులు, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు మిఠాయి రమేష్, శ్రీపాద శ్రీవల్లభ పురం దత్త పీఠం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రామలింగారెడ్డి సభ్యులు, పసుపుల దత్తు,చిట్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply