పాఠశాల యూనిఫార్మ్‌ల పంపిణీలో జాప్యం..

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన స్కూల్ యూనిఫార్మ్‌లు సరఫరా కాలేదు. దీంతో పలువురు విద్యార్థులు పాత దుస్తులతో పాఠశాలకు హాజరవుతుండగా, మరికొందరు యూనిఫార్మ్ లేకుండానే తరగతులకు వస్తున్నారు.

దాదాపు 19 రోజులుగా యూనిఫార్మ్‌ల పంపిణీ ఆలస్యం కావడంతో విద్యాశాఖపై నిర్లక్ష్యం ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో యూనిఫార్మ్‌లు అందించినట్లు సమాచారం.

విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నోట్‌బుక్స్ వంటి విద్యా కిట్లను పాఠశాలలు ప్రారంభమైన నాటికే పూర్తిగా అందించినప్పటికీ, యూనిఫార్మ్‌లు, బెల్టులు, బూట్లు వంటి అంశాలు ఇంకా చేరలేదు. ప్రభుత్వం వీటన్నింటిని కలిపి “విద్యా కిట్”గా అందిస్తామని గతంలో ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇటీవల టెండర్లు పూర్తి చేసి యూనిఫార్మ్‌ల తయారీ జరుగుతోందని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో కొత్త యూనిఫార్మ్‌లు విద్యార్థులకు పంపిణీ చేసే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో సుమారు 54,666 మంది విద్యార్థులు 167 పాఠశాలల్లో చదువుతున్నారు. గత విద్యా సంవత్సరం ముగిసే సమయంలోనే విద్యార్థుల కొలతలు తీసుకుని సిద్ధంగా ఉంచినప్పటికీ, ప్రారంభానికి సమయానికి యూనిఫార్మ్‌లు అందించలేకపోయారు.

దుస్తులను చేనేత సంఘాలకు ఇచ్చి కుట్టించే విధానం గతంలో అమల్లో ఉండేదని, ఈసారి కూడా అదే విధంగా తయారీ జరుగుతోందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే వారం, పది రోజుల్లో పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.