Humanity Shamed I అమ్మా అని ఏడ్చే లోపే నలిపేశారు..!

Humanity Shamed I అమ్మా అని ఏడ్చే లోపే నలిపేశారు..!

Humanity Shamed I అచ్చంపేట, ఆంధ్రప్రభ:
కన్నప్రేమ కనుమరుగైందో.. కాసుల కక్కుర్తికి మానవత్వం మంటగలిసిందో తెలియదు కానీ, అచ్చంపేట నడిబొడ్డున మాతృత్వానికే తీరని అవమానం జరిగింది. అమ్మ కడుపులోంచి లోకాన్ని చూడకముందే అనంత లోకాలకు వెళ్లిన ఆ పసికందు.. కనీసం మట్టిలో కలిసిపోయే గౌరవానికి కూడా నోచుకోలేదు. ఆసుపత్రి యాజమాన్యాల నిర్లక్ష్యమో.. అధికారుల ఉదాసీనతో కానీ, నవజాత శిశువు మృతదేహం వీధి కుక్కల నోటికి చిక్కి చెత్తకుప్పల్లో ముక్కలైంది. ఈ ఘోరం చూసి సమాజం తలదించుకుంటోంది.

గుండెలు పగిలే దారుణం.. వీధి కుక్కల నోట పసిబిడ్డ శవం!
ఇటీవలే ఒక పసికందు మృతదేహం మురికికుంటలో తేలిన ఘటన మరువకముందే.. అచ్చంపేటలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పుట్టిన బిడ్డ శవాన్ని కనీస మానవత్వం లేకుండా చెత్తకుప్పలో పడేశారు. ఆ పసిదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతింటూ.. కాలనీలోని ఇళ్ల ముందు వరకు ఈడ్చుకొస్తుంటే చూసిన స్థానికుల గుండెలు తరుక్కుపోయాయి. “కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ప్రాణం.. ఇలా వీధి కుక్కల పాలవుతుంటే ఏ తల్లి కడుపు కోత అనుభవించిందో” అని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వైద్యం పేరిట ‘యమపాశాలు’.. అధికారుల నిర్లక్ష్యమే వీరికి అండనా?
అచ్చంపేటలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కక్కుర్తి కోసం నిబంధనలను నడిరోడ్డుపై తగలబెడుతున్నాయి. అర్హత లేని వ్యక్తులతో అనధికారిక అబార్షన్లు, డెలివరీలు చేస్తూ పసిప్రాణాలను బలితీసుకుంటున్నాయి. శిశువు మరణిస్తే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, లేదా నిబంధనల ప్రకారం ఖననం చేయకుండా చెత్తలా పారేసే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దందా వారి కంటికి కనిపించడం లేదా? అని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

పుట్టిన బిడ్డకు కనీస గౌరవం లేని సమాజమా ఇది..?
“అమ్మ కడుపులో తొమ్మిది నెలలు మోసి.. లోకంలోకి తెచ్చిన బిడ్డకు కనీస అంతిమ సంస్కారం కూడా దక్కని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా? వైద్యం పేరిట ప్రాణాలు తీస్తున్న ఈ యమపురులపై చర్యలు తీసుకునే నాథుడే లేడా?” అని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇకనైనా మేల్కొనండి.. కఠిన చర్యలు తీసుకోండి!
ఈ వరుస ఘటనలు అచ్చంపేట ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. కేవలం నోటీసులతో కాలయాపన చేయకుండా, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సదరు ప్రైవేట్ ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నవజాత శిశువుల మరణాలపై సమగ్ర విచారణ జరిపి, ఈ ‘వైద్య మాఫియా’కు అడ్డుకట్ట వేయాలి. లేదంటే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే రోజు ఎంతో దూరంలో లేదు.

ఈ పసికందుల ఆక్రందనలు.. అధికారుల చెవులకు వినబడతాయా? లేక మరో దారుణం జరిగే వరకు ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారా? కాలమే సమాధానం చెప్పాలి.