రెండు చోట్ల ఓటు నమోదు చట్టరీత్యా నేరం
జూలై 14 వరకు ఇంటింటి సర్వే
పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీ: కలెక్టర్
చెర్లోపల్లిలో సర్వేను తనిఖీ
తిరుపతి, ఆంధ్రప్రభ : రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఓటు హక్కు పొందడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామంలో ఇంటింటి సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ఓటర్లతో మాట్లాడి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు.
ఫారాలను పూర్తిగా నింపి బీఎల్ఓలకు, బీఎల్ఏల ద్వారా లేదా ఆన్లైన్లో సమర్పించవచ్చని చెప్పారు. ప్రభుత్వం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే పరిశీలించి అర్హుల పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చుతామని వివరించారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, ద్వంద్వ ఓటు నమోదులు కలిగిన వారి పేర్లను తొలగించడంతో పాటు, 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల నమోదు, నివాసం మారిన వారి ఓటు బదిలీ ప్రక్రియ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలని, ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, కచ్చితమైన, పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.
