విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులపై ప్రత్యేక నిఘా

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల నియంత్రణకు కరీంనగర్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న పాన్ షాపులు, కిల్లీ షాపుల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. యువత మాదకద్రవ్యాలు, మత్తు కలిగించే పదార్థాల బారిన పడుతున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ముఖ్యంగా మత్తును కలిగించే చాక్లెట్లు, ఇతర నిషేధిత పదార్థాల విక్రయాలపై దృష్టి సారించి షాపులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో త్రీటౌన్ ఎస్‌ఐ శ్రీనివాసరావు, జగదీశ్వర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.