ప్రజల తీర్పు జగన్‌కు గుణపాఠం…
- మళ్లీ అదే తీరు సాగితే మరింత దారుణం
- మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
- 42వ డివిజన్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం
- కూటమి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ
- డీఎస్సీ ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్
- కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని వెల్లడి
విజయవాడ, ఆంధ్రప్రభ : “ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితం చేసి జగన్మోహన్రెడ్డికి గుణపాఠం చెప్పారని, అయినా ఆయన తీరు మారకపోతే భవిష్యత్తులో ఇంకా దారుణమైన ఫలితాలు తప్పవు” అని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో శుక్రవారం నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల పెన్షన్‌కు చేరుకోవడానికి ఐదేళ్లు పట్టిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచిందన్నారు. ఎన్నికల హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘తల్లికి వందనం’ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒక్క విద్యార్థికే ఆర్థిక సాయం అందించగా, ప్రస్తుతం అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తోందన్నారు.
నంద్యాల జిల్లాలోని ఒక మైనారిటీ కుటుంబంలో 11 మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి చేకూరడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. డీఎస్సీ నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని విమర్శించిన వెంకన్న, మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా 16,347 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఎక్కడైనా అవినీతి లేదా పక్షపాతం జరిగి ఉంటే చర్చకు రావాలని, ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ ఎలాంటి భద్రత లేకుండానే ఒంటరిగా చర్చకు సిద్ధమని ప్రకటించారని గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ పనితీరును అభినందిస్తున్నారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్ మల్లెల ఈశ్వర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, డివిజన్ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, సంతోష్, జనసేన నాయకురాలు అనూష, పశ్చిమ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు శివాజీ, నెలకుర్తి వెంకటరావు, కాకొల్లు సురేష్, స్రవంతి, అలీ తదితరులు పాల్గొన్నారు.
